Portugal PM Resigned : పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆంటోనియో కోస్టా ప్రకటించారు. తనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యానని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజాను కలిసిన అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని ఆంటోనియో కోస్టా ప్రకటించారు.
పోర్చుగల్‌లో లిథియం మైనింగ్, హైడ్రోజన్ ప్రాజెక్టుల నిర్వహణలో అక్రమాలకు సంబంధించిన విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ఆంటోనియో కోస్టా ప్రభుత్వం గద్దె దిగాలంటూ అంతకముందు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఆంటోనియా కోస్టా సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ప్రధాని, మంత్రుల నివాసాల్లో సుమారు 140 మంది డిటెక్టివ్‌లు తనిఖీలు నిర్వహించారు. కోస్టా భారత మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు.
అవినీతి వ్యవహారంలో దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆస్తులపై పలుమార్లు దాడులు జరిపిన పోలీసులు.. ప్రధాని ఆంటోనియో కోస్టా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. సోషలిస్టు పార్టీ సారథ్యంలో పోర్చుగల్ ప్రధానిగా ఆంటోనియో కోస్టా 2015 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.
Indian Origin World Leaders : అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాల రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆయా దేశాల ఎన్నికల్లో పోటీ చేసి అత్యున్నత పదవులు అధిష్టిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం సింగపూర్ అధ్యక్షుడిగా భారత మూలాలున్న థర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. అమెరికాలో భారతీయ- అమెరికన్ల ప్రభావం పెరుగుతోందనడానికి ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ విజయాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారత్‌ను 200 ఏళ్లు పాలించిన బ్రిటన్‌కు ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నికయ్యారు. 210 ఏళ్ల బ్రిటన్ రాజకీయ చరిత్రలో చిన్న వయసులోనే ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. గోవా మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్, క్లైర్.. రిషి సునాక్ కేబినెట్‌లో హోంశాఖ, ఇంధన భద్రత శాఖ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.