ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. అలా వెళ్లినవారిలో చాలా మంది అక్కడే స్థిరపడుతుండటమూ చూస్తున్నాం. ఆసియా దేశాలు.. అందులోనూ భారత్ నుంచి విదేశాలకు వలస వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. అమెరికాతో సహా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు భారతీయులు ఎక్కువగా వెళ్తున్నారు. ఇవే కాకుండా విద్య, వైద్యంతో పాటు మంచి ఉపాధి అవకాశాలను, జీవన ప్రమాణాలను అందించే ఐరోపా దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని యూరోపియన్ దేశాలు తమ దేశాల్లో స్థిరపడాలని అనుకునే వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. చాలా దేశాల్లో యువత సంఖ్య తగ్గిపోతోంది. వయసు మీరిన వారు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశాల్లో స్థిరపడాలని వచ్చే విదేశీ పౌరులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు రీలొకేషన్ గ్రాంట్లు కూడా ఇస్తున్నాయి. స్పెయిన్, ఇటలీ ఈ ఆఫర్లు ఇస్తున్న జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.
వారికి మాత్రమే ఛాన్స్!
స్విట్జర్లాండ్‌లోని అల్బినెన్ అనే పట్టణంలో 250 మంది ప్రజలు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఇక్కడ స్థిరపడాలనుకునే కుటుంబాలకు 50 వేల యూరోలు (భారత కరెన్సీలో సుమారుగా రూ.44.74 లక్షలు) చెల్లిస్తోంది అక్కడి ప్రభుత్వం. 45 ఏళ్ల లోపు వయసు వారు ఆ గ్రామంలో సెటిల్ అయితే.. 25 వేల యూరోలు (రూ.22.71 లక్షలు) ఇస్తోంది. పిల్లలను కూడా తమతో తీసుకెళ్తే అదనంగా మరో 10 వేల యూరోలు (రూ.9.19 లక్షలు) అందిస్తోంది. అయితే.. స్విట్జర్లాండ్ పౌరులకు మాత్రమే పైప్రాంతాలకు మారే అవకాశం ఉంది. అలాగే ఆ దేశంలో చాన్నాళ్ల పాటు ఉండి 'సీ' రెసిడెన్స్ కలిగిన విదేశీయులకూ ఛాన్స్ ఉంది. అయితే, రూ.కోటి 80 లక్షలు విలువ చేసే ఇంట్లోనే వీరు నివసించాలి. పదేళ్ల పాటు అల్బినెన్లోనే ఉంటామని హామీ ఇవ్వాలి.
పర్వత ప్రియులకు స్వర్గధామం
స్పెయిన్‌లోని కాంటాబ్రియాన్ పర్వతాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. మన దగ్గర జమ్ముకశ్మీర్లాగే కాంటాబ్రియాన్ పర్వత శ్రేణుల అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు! ఈ మంచు కొండలు, పచ్చదనం మధ్య ఉండే చిన్న పట్టణమే పోంగా. ఇక్కడ 600 మంది పౌరులు మాత్రమే నివాసం ఉంటున్నారు. పర్వతారోహణ చేసేవారికి దీన్ని స్వర్గధామంగా చెబుతారు. ఇక్కడ స్థిరపడాలనుకుంటే ఒక్కొక్కరికి 2,971 యూరోలు (రూ.45.43 లక్షలు) చొప్పున చెల్లిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఈ ఆఫర్ బ్రిటన్ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అందులోనూ ఇక్కడ ఐదేళ్ల పాటు కచ్చితంగా ఉంటామని వారు హామీ ఇవ్వాలి.
నెలకు రూ.13 వేలు
స్పెయిన్‌లోనే మరో అందమైన ప్రాంతం ఉంది. అదే గలీసియాలోని రుబియా గ్రామం. ఇక్కడ స్థిరపడేవారికి నెలకు 150 యూరోలు (రూ.13,630) చెల్లిస్తుంది ప్రభుత్వం. కుటుంబాలతో వచ్చి స్థిరపడే వారి సంఖ్యను పెంచేందుకు ఈ ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నారు. స్థానిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. వాయవ్య స్పెయిన్‌లో ఉండే రుబియా గ్రామం నుంచి శాంటియాగో డి కాంపోస్టెలా నగరానికి వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం మాత్రమే పడుతుంది.
ఉద్యోగం లేదా వ్యాపారం తప్పనిసరి
ఇటలీ ఎంత అందమైన దేశమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఈ దేశంలో నైరుతి వైపున ఉన్న కాలబ్రియా అనే గ్రామంలో మొత్తం 2 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడికి మీరు షిఫ్ట్ అయితే ప్రభుత్వం 28 వేల యూరోలు (రూ.25.44 లక్షలు) ఇస్తుంది. గ్రామంలో జనాభా సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇస్తున్నారు. ఇక్కడ స్థిరపడాలనుకునేవారు 40 ఏళ్ల లోపు వారై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అప్లికేషన్‌ను ఆమోదిస్తారు. అక్కడికి వెళ్లాక తప్పనిసరిగా ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలి లేదా వ్యాపారం మొదలుపెట్టాలి.
పిల్లలు పుట్టినా డబ్బులు ఇస్తారు
ఇటలీలో మరో ప్రాంతం కూడా విదేశీ పౌరులకు స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అదే దక్షిణ ఇటలీలో ఉన్న పుగ్లియా. ఇక్కడికి మారితే 30 వేల యూరోలు (రూ.27.26 లక్షలు) చెల్లిస్తారు. అధికారికంగా అక్కడికి మారుతున్నామని ధ్రువీకరణ పత్రాలు అందిస్తే ఈ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన డబ్బును.. అక్కడ ఓ ఇంటిని తీసుకుని పునరుద్ధరించేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్కడికి షిఫ్ట్ అయ్యాక పిల్లలు పుడితే.. ప్రతి బిడ్డకు 1,000 యూరోలు (రూ.90,868) చెల్లిస్తారు.
తీరప్రాంతంలో సెటిలైతే స్పెషల్ గ్రాంట్లు
పర్వత ప్రాంతాలు, పట్టణాలు కాకుండా నదులు, సముద్రతీర ప్రాంతాలకు మారాలని అనుకుంటున్నారా? అయితే ఇటలీలోని సర్దినియా ద్వీపం చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు. ఇక్కడి బీచ్‌లు చాలా ఫేమస్. అయితే, స్థానికంగా ఉన్న యువత ఉపాధి కోసం విదేశాలకు తరలివెళ్తున్నారు. ఈ వలసలను పూడ్చుకునేలా విదేశీయులకు ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది.
ఇక్కడికి రీలొకేట్ అయితే 15 వేల యూరోలు (రూ.13.63 లక్షలు) చెల్లిస్తారు. 3వేల మందికి గ్రాంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందుకోసం 45 మిలియన్ల నిధులను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ వర్తించాలంటే విదేశీయులు ఫుల్‌టైమ్ ఇక్కడే నివసించాలి. ఇక్కడికి వచ్చిన 18 నెలల్లోపు శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవాలి.