కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సతమతమవుతోన్న ఉత్తరకొరియాను వరుస అంటువ్యాధులు వెంటాడుతున్నాయి. కొవిడ్ కట్టడి చేయలేక చేతులెత్తిస సమయంలోనే టైఫాయిడ్, మిజిల్స్, కోరింతదగ్గు వంటివి విస్తృతంగా వ్యాపించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాజాగా మరో అంటువ్యాధి ఉత్తర కొరియాను వేధిస్తున్నట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన కిమ్ జోంగ్ ఉన్.. వ్యాధి బారినపడిన వారికి తన కుటుంబం కోసం భద్రపరచిన ఔషధాలను అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించింది. అయితే, తాజాగా వెలుగు చూసిన ఈ అంటువ్యాధి ప్రమాదం ఏ మేరకు ఉందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఉత్తర కొరియాలోని ఆగ్నేయ ప్రాంత నగరమైన హైజూ నగరంలో అంటువ్యాధి కలకలం రేపినట్లు ఉత్తరకొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఈ వ్యాధి వల్ల తీవ్రస్థాయిలో జీర్ణాశయ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర్‌కొరియా అధినేత, ఆయన సతీమణి రి సోల్ జూతో కలిసి బాధితులకు ఔషధాలు, సెలైన్ల పంపిణీ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా కేసీఎన్‌ఏ విడుదల చేసింది. అయితే, ఆ అంటువ్యాధి ఏమిటీ..? ఇప్పటివరకు ఎంతమంది దాని బారినపడ్డారు..? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
కలుషిత నీరు, ఆహారం వల్ల కలిగే టైఫాయిడ్, కలరా వంటిదే ఈ 'ఎంటరిక్ ఎపిడమిక్' అంటువ్యాధి అని కొందరు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన వారి విసర్జనాలను తాకడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. ఇటువంటి అంటువ్యాధులు ఉత్తర కొరియాలో సర్వసాధారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన నీటి శుద్ధి కేంద్రాలు లేకపోవడం, అధ్వాన్నమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఎంతోకాలంగా అక్కడ అంటువ్యాధుల ప్రాబల్యం అధికంగా ఉందని వెల్లడిస్తున్నారు.
45లక్షల మందికి కరోనా.. గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ జాడే లేదని చెప్పుకొన్న ఉత్తర కొరియాలో ఇటీవల కొవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే, భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసే స్థాయిలో లేని ఉ.కొరియా.. లక్షల మంది జ్వరాలు, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలతో బాధపడ్డారని మాత్రమే తెలిపింది. రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన ఉత్తర కొరియాలో దాదాపు 45లక్షల మంది జ్వరాల బారినపడగా.. 75 మంది మరణించినట్లు అక్కడి అధికారిక మీడియానే తెలిపింది. అయినప్పటికీ అక్కడ కొవిడ్ మరణాలపై అంతర్జాతీయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే, వరుస అంటువ్యాధులు విజృంభిస్తోన్న సమయంలో కిమ్ కుటుంబం కోసం కేటాయించిన ఔషధాలను బాధితులకు పంపిణీ చేస్తున్నారు. దేశంలో నెలకొన్న అంటువ్యాధుల ముప్పు అంశాన్ని అవకాశంగా మలచుకొని.. తమ దేశప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లుగా ఉ.కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకే స్వయంగా ఈ ఔషధాల పంపిణీని చేపట్టినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్‌తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్'!
ఉత్తర కొరియాను కుదిపేస్తున్న కరోనా.. 3.5 లక్షల మంది క్వారంటైన్!