North Korea Ballistic Missile Test : సైనిక నిఘా ఉపగ్రహాన్ని జూన్ 11లోపు ప్రయోగించనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉత్తర కొరియా.. ఓ రాకెట్ ప్రయోగం చేసింది. ఈ మేరకు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఇది నిఘా ఉపగ్రహానికి సంబంధించిన ప్రయోగమేనని తెలుస్తోంది. అయితే, ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం విఫలమైందని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. రాకెట్ ప్రయాణం అసహజంగా సాగిందని తెలిపింది. శిథిలాలు సముద్రంలో పడిపోయాయని పేర్కొంది.
'సాధ్యమైనంత త్వరలో'
ఉత్తర కొరియా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం సముద్రంలో కూలిపోవడంపై ఆ దేశం స్పందించింది. సాధ్యమంత త్వరగా మరో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని పేర్కొందని ఉత్తర కొరియా మీడియా ఓ కథనంలో తెలిపింది. తాజా నిఘా ఉపగ్రహ ప్రయోగంలో తీవ్ర లోపాలు ఉన్నాయని.. అందుకే విఫలమైందని పేర్కొంది. మరోవైపు.. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో ఉండాలని ఆదేశించాయి.
North Korea Spy Satellite Launch : అమెరికా, దాని భాగస్వాముల సైనిక కదలికల పర్యవేక్షణ కోసం నిఘా ఉపగ్రహాన్ని సిద్ధం చేసినట్లు ప్రకటించిన కిమ్ సర్కార్.. ఇప్పటికే ఆ విషయాన్ని జపాన్‌కు తెలిపింది. కొరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన రెండు ప్రాంతాలు, ఫిలిప్పీన్స్‌కు తూర్పున ఉన్న మరో ప్రాంతంలో శిథిలాలు పడతాయని జపాన్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం ఇచ్చింది. సైనిక నిఘా తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి తుది సన్నాహాలు చేయాలని కిమ్ ఆదేశించిన మరుసటి రోజే రాకెట్ ప్రయోగం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
మే 31 నుంచి జూన్ 11 మధ్య ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రణాళిక గురించి ఉత్తర కొరియా తమకు తెలియజేసినట్లు జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అంతలోనే ఉత్తర కొరియా తాజా ప్రయోగం చేసిందని పేర్కొంది. మరోవైపు.. జపాన్ భూభాగంలోకి ఏదైనా ప్రవేశించినట్లయితే కూల్చివేయాలని జపాన్ రక్షణ శాఖ మంత్రి తమ బలగాలను ఆదేశించారు.
'అందుకే నిఘా ఉపగ్రహం'
అగ్రరాజ్యం అమెరికా.. భద్రతా బెదిరింపులను దిగుతోందని ఉత్తర కొరియా ఉన్నతాధికారి, కిమ్ సన్నిహితుడు రి ప్యోంగ్ చోల్ మంగళవారం తెలిపారు. అందుకే నిఘా, సమాచారం కోసం జూన్‌లో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఆయన అలా చెప్పిన మరుసటి రాకెట్‌ను ఉత్తర కొరియా ప్రయోగించడం గమనార్హం. ఈ ఉపగ్రహం సైనికుల కదలికలను, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు వంటి వాటిని గుర్తించగలదని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర కొరియా 2022 ఆరంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఎక్కువ అమెరికా లక్ష్యంగా చేసినవే.
అమెరికా హెచ్చరికలు బేఖాతరు..
అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఉత్తర కొరియా గతేడాది నవంబరులో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఢీకొట్టే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఉత్తర తూర్పుతీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. దీనిపై చర్చించేందుకు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తమ పశ్చిమతీర ప్రాంతం నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.