9 babies Mali woman: ఏడాది క్రితం మాలీకి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకే కాన్పులో పుట్టిన ఆ తొమ్మిది చిన్నారులు పూర్తి ఆరోగ్యంతో తమ తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
9 babies born update: ఆఫ్రికా దేశం మాలీకి చెందిన హాలిమా సిస్సేకు సరిగ్గా ఏడాది క్రితం ఒకే కాన్పులో తొమ్మిది మంది జన్మించారు. మొరాకోలోని ఓ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు శ్రమించి తల్లీ పిల్లలను కాపాడారు. తొమ్మిది మంది సంతానంలో అయిదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఈ తొమ్మిది మంది చిన్నారులు ప్రస్తుతం పాకేదశకు చేరుకున్నారు. కొంతమంది కూర్చుంటూ ఉంటే, మరికొంతమంది గోడలు పట్టుకుని నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా వీరి మొదటి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మొరాకోలో వారు పుట్టిన క్లినిక్‌లోనే వేడుకలు నిర్వహించినట్లు ఆ చిన్నారుల తండ్రి అబ్దెల్‌కాదెర్ అర్బీ తెలిపారు. నర్సులు, తమ అపార్ట్‌మెంట్‌లోని మరికొంత మంది సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఎయిన్ బోర్జా క్లినిక్ యజమానులకు చెందిన వైద్య సౌకర్యాలతో కూడిన ఫ్లాట్‌లో వారు ఉంటున్నట్లు వెల్లడించారు. పిల్లలందరినీ పూర్తి ఆరోగ్యంగా చూస్తుంటే సంతోషంగా ఉందంటున్న ఆ తండ్రి.. భార్య హలీమా సిస్సె సైతం కోలుకున్నట్లు వివరించారు. ఈ అపూర్వ సమయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు.
ఇదీ చదవండి: ఆమెనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: బిల్ గేట్స్