ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ఉద్యోగుల్లో గుబులు నెలకొన్న వేళ అమెరికా సర్కారు నివేదిక తీపికబురు అందించింది. ఈ జనవరిలో అమెరికా సంస్థలు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు వడ్డీరేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచినప్పటికీ అక్కడభారీగా ఉద్యోగ కల్పన జరిగినట్లు తెలిపింది. అమెరికాలో నిరుద్యోగ రేటు 3.4 శాతానికి పడిపోయి 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుందని వివరించింది. నిరుద్యోగం పెరగడం వల్ల మాంద్యం వస్తుందన్న ఆర్థికవేత్తల అంచనాను ప్రభుత్వ నివేదిక పటాపంచలు చేసింది. ఉద్యోగులకు ఇది శుభ పరిణామమని పేర్కొంది.
గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ఈ జనవరిలో ఉద్యోగ కల్పన అధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. డిసెంబర్‌లో 2 లక్షల 69వేల ఉద్యోగాలు కల్పించగా.. జనవరిలో 5 లక్షల 17 వేలమందికి కొలువులు ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతాయా అన్న ఆశారేఖలు చిగురిస్తున్నాయి. 4 దశాబ్దాల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు గతేడాది ఫెడ్ అన్ని ప్రయత్నాలు చేసింది. గత మార్చి నుంచి కీలక వడ్డీరేట్లను 8 సార్లు పెంచడం వల్ల క్రమంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది.
ఓ వైపు కంపెనీలన్నీ రికార్డు స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నప్పటికీ.. చాలామందికి ఉద్యోగ భద్రత కలిగి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫిలిప్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా ఉద్యోగ కోతలు విధించినా.. చాలామంది ఉద్యోగ భద్రతను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. దీంతో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది కొత్త కొలువుల్లో చేరడానికి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సమర్థవంతమైన ఉద్యోగులను ఎంచుకునేందుకు కంపెనీలకు కూడా మంచి సమయమని పేర్కొంది.