Bruce Lee Death Reason : తన మార్షల్ ఆర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ లెజెండరీ నటుడు బ్రూస్ లీ అతి చిన్న వయసులోనే లోకాన్ని వీడారు. 1973 జులైలో తన 32వ ఏట సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో మరణించారు. అయితే ఆయన మృతికి సంబంధించి తాజాగా విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్‌లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపుతో బ్రూస్‌లీ మరణించినట్లు అప్పట్లో వైద్యులు వెల్లడించారు. అయితే, పెయిన్‌కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ, హైపోనాట్రేమియా వల్లే బ్రూస్‌లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. అతిగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోవడాన్ని హైపోనాట్రేమియాగా వ్యవహరిస్తారు. సోడియం స్థాయుల్లో సమతుల్యత లోపించి శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందాయని, అదే అతడి మరణానికి దారితీసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"ఓ నిర్దిష్ట కిడ్నీ వైఫల్యం కారణంగా బ్రూస్ లీ మరణించి ఉంటారని మేం అంచనా వేస్తున్నాం. శరీరంలోని అధిక నీటిని బయటకు పంపించడంలో అతడి కిడ్నీలు విఫలమయ్యాయి. అది హైపోనాట్రేమియాకు, సెరెబ్రల్ ఎడిమాకు దారితీసింది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, మరిజునా వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిగా దాహం వేయడం, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వంటి అలవాట్ల కారణంగా.. అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీయొచ్చు" అని ఈ అధ్యయనం వెల్లడించింది.
కాగా.. బ్రూస్ లీ ఎక్కువగా క్యారెట్, యాపిల్ జ్యూస్ లాంటి ద్రవపదార్థాలు అధికంగా ఉండే డైట్ తీసుకునేవారని ఆయన సతీమణి లిండా లీ కాడ్‌వెల్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక బ్రూస్ లీ అనారోగ్యంపై మాథ్యూ పాలీ అనే ఓ రచయిత 2018లో ‘బ్రూస్ లీ: ఎ లైఫ్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. అందులో లీ రోజువారీ నీటి వినియోగాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. "బ్రూస్ లీ.. నీటిని తన స్నేహితుడిగా చెప్పేవారు. దురదృష్టవశాత్తూ అదే నీరు అతడి ప్రాణాలు తీసినట్లుగా అనిపిస్తోంది" అని తాజా అధ్యయనం తెలిపింది.
ఇవీ చదవండి: ప్రతి 11 నిమిషాలకొక మహిళ బలి.. కుటుంబ సభ్యుల చేతిలోనే!
నివాస ప్రాంతంలో కూలిన విమానం.. 8 మంది మృతి.. ఏడు ఇళ్లు ధ్వంసం