Man Survives 18 Hours At Sea: చిన్న పిల్లల ఆటవస్తువును ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రమాదవశాత్తూ సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 గంటలపాటు ఆ ఆటవస్తువును ఊతంగా చేసుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. ఫాక్స్ 5 న్యూయార్క్ కథనం ప్రకారం.. ఇవాన్ (30) అనే వ్యక్తి తన మిత్రుడితో కలిసి మైతీ బీచ్‌కు వెళ్లాడు. అయితే తీవ్ర అలల కారణంగా వారిద్దరు సముద్రంలో కొట్టుకుపోయారు.
చిన్న ఫుట్‌బాల్ సహాయంతో.. సమాచారం అందుకున్న గ్రీక్ తీర రక్షణ దళం బాధితుల కోసం ఎంత వెతికినా వారి జాడ కనిపించలేదు. వారిద్దరు మృతిచెంది ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నారు. వారి మృతదేహాల కోసం వేట ప్రారంభించారు. అయితే తీరం నుంచి కిలోమీటర్ల దూరంలో ఇవాన్ ప్రాణాలతో కనిపించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. అతడిని కాపాడి ఆసుపత్రికి తలించారు. అయితే, పిల్లలు ఆడుకునే చిన్న ఫుట్‌బాల్ నీటిలో దొరకడంతో, దాని సాయంతో మునిగిపోకుండా ఇవాన్ తనను తాను కాపాడుకోవడం విశేషం. అలా ఏకంగా 18 గంటలపాటు చిన్న బంతిని ఊతంగా చేసుకొని ప్రాణాలను రక్షించుకున్నాడు.
'ప్రాణాలతో బయపడతానని అనుకోలేదు'.. అయితే తాను ప్రాణాలతో బయటపడతానని ఊహించలేదని ఇవాన్ పేర్కొన్నాడు. ఆ బంతిలో గాలి నెమ్మదిగా పోతున్నాకొద్దీ, మళ్లీ గాలి ఊది.. దాని సాయంతోనే మునిగిపోకుండా ఉండగలిగానని తెలిపాడు. ఆ ఫుట్‌బాల్ గనక లభించకపోతే తాను మృతిచెందేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇవాన్ మిత్రుడు మార్టిన్ జవనోస్కి ఆచూకీ మాత్రం లభించలేదు.
'తన కుమారుడి బంతే అది'.. ఇవాన్ కథనం, ఫొటోలు అక్కడి మీడియాలో సంచలనంగా మారాయి. ఆ బంతి ఫొటోలను చూసిన మహిళ అది తన కుమారుడి బంతేనని తెలిపారు. పది రోజుల క్రితం బీచ్‌లో ఆడుకుంటుండగా బంతి సముద్రంలో గల్లంతైందని పేర్కొన్నారు. తన బిడ్డ పోగొట్టుకున్న బాల్ ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: కండోమ్‌లు తెగ వాడేస్తున్నారు.. భారత మార్కెట్ కొత్తపుంతలు!
21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్