Japan train late news: అన్యాయంగా జీతంలో కోతపెట్టారంటూ తాను పనిచేసే సంస్థ యజమాన్యంపై న్యాయపోరాటానికి దిగిన ఓ వృద్ధుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతడి వేతనంలో కట్ చేసిన రూ.34ను తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. అనారోగ్యంతో ఆ ఉద్యోగి మరణించిన కొద్దిరోజుల తర్వాత ఈ తీర్పు రావడం విశేషం. ఈ ఘటన జపాన్‌లో జరిగింది.
నిమిషం పనిచేయలేదని..: హిరోఫుమీ వాడా(59).. పశ్చిమ జపాన్ రైల్వేలో డ్రైవర్. 2021 జూన్ 18న ఒకాయమా స్టేషన్లో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రయాణికులంతా దిగేశాక ఖాళీగా ఉన్న రైలును ప్లాట్‌ఫాం నుంచి డిపోలోకి తీసుకెళ్లడం అతడి విధి. అయితే.. పొరపాటున హిరోఫుమీ ఒక ప్లాట్‌ఫాంకు బదులు మరొకదానికి వెళ్లాడు. వెంటనే తిరిగి వచ్చి రైలును డిపోకు తీసుకెళ్లాడు. అయితే.. అప్పటికే నిమిషం ఆలస్యమైంది. దీనిని తీవ్రంగా పరిగణించింది పశ్చిమ జపాన్ రైల్వే యాజమాన్యం. హిరోఫుమీ నిమిషం పనిచేయలేదంటూ అతడి జీతంలో 56 యెన్(సుమారు రూ.34) కోత పెట్టింది.
అన్యాయంగా తన జీతంలో కోత పెట్టారంటూ ఒకాయమాలోని కోర్టును ఆశ్రయించాడు హిరోఫుమీ వాడా. తన వేతనంలో కట్ చేసిన 56 యెన్‌తో పాటు తనను మానసికంగా వేధించినందుకు మరో 22లక్షల యెన్(సుమారు రూ.13 లక్షలు) పరిహారంగా ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరాడు. దీనిపై వాడీవేడి వాదనలు జరిగాయి. చివరకు హిరోఫుమీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. అతడు కోరినట్టు పరిహారం ఇప్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జీతంలో కోత పెట్టిన 56 యెన్ను తిరిగివ్వాలని పశ్చిమ జపాన్ రైల్వేను ఆదేశించింది. అయితే.. ఈనెల 19న ఈ తీర్పు రాగా.. అందుకు 16 రోజుల ముందే హిరోఫుమీ మరణించాడు.
టైమ్ అంటే టైమ్: షెడ్యూల్‌ను పక్కాగా ఫాలో అయ్యే విషయంలో జపాన్ రైల్వే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. 2017లో షెడ్యూల్‌కన్నా 20 సెకన్ల ముందు ట్రైన్ బయలుదేరిందని రైల్వే సంస్థ ప్రజలకు క్షమాపణలు చెప్పిందంటే.. సమయపాలనకు వారు ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. షెడ్యూల్‌కన్నా కొన్ని సెకన్లు కూడా రైళ్లు ఆలస్యం కాకుండా చూసేందుకు ఉద్యోగుల పట్ల జపాన్‌లోని రైల్వే సంస్థలు కఠినంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
కొన్నిసార్లు ఇది ప్రయాణికుల ప్రాణాల్ని బలిగొన్న సందర్భాలూ ఉన్నాయి. 2005లో హ్యోగోలో ఓ రైలు ప్రమాదానికి గురికాగా.. 105 మంది మరణించారు. అప్పటికే ఆలస్యమైందని, ఇంకా లేట్ అయితే కఠిన చర్యలు తప్పవని భయపడిన 23 ఏళ్ల డ్రైవర్.. మలుపు ఉన్నచోట కూడా రైలును వేగంగా వెళ్లనీయడమే ఈ దుర్ఘటనకు కారణమని విచారణలో తేలింది. ఇలాంటివే మరికొన్ని ఘటనలు ఉన్నాయి.