Imran Khan news : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్ ఖదీర్ ట్రస్టు భూముల కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇమ్రాన్‌కు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించింది. మే 9 తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన ఏ కేసులోనూ ఆయనను మే 17 వరకు అరెస్ట్ చేయవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించినట్లు పాక్ మీడియా పేర్కొంది.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు భారీ భద్రత మధ్య ఇమ్రాన్‌ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు రెండు గంటల పాటు విచారణ వాయిదా పడింది. ప్రతి శుక్రవారం చేసే ప్రత్యేక ప్రార్థనల అనంతరం విచారణను తిరిగి ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రారంభించింది. అయితే విచారణ అనంతరం పీటీఐ కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగిస్తారన్న వార్తల నేపథ్యంలో కోర్టు వద్దకు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Imran Khan arrest : తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పాక్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై NABపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్ భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇస్లామాబాద్ పోలీసులను సుప్రీం ఆదేశించింది.
'నిద్ర పోనివ్వట్లేదు.. వాష్‌రూమ్ కూడా వాడుకోనివ్వట్లేదు'
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్‌తో ఓ గంటపాటు న్యాయవాదులు భేటీ అయ్యారు. తనను జైల్లో నిద్ర పోనివ్వలేదని టాయిలెట్, బెడ్‌లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ ఈ సందర్భంగా తమకు తెలిపినట్లు ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. వాష్‌రూమ్ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయారని న్యాయవాదులు అన్నారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్‌లోని పోలీస్ లైన్స్‌కు తీసుకువెళ్లిన తర్వాత ఆహారం కూడా ఇవ్వలేదని ఇమ్రాన్ న్యాయవాదులు ఆరోపించారు.
Imran Khan Pakistan arrested why : అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. అనంతరం పాకిస్థాన్ లో అల్లర్లు చెలరేగడం సహా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.