Iran Protests : ఇరాన్‌లో 22 ఏళ్ల మాసా అమీని మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. పోలీసుల అదుపులో ఉన్న అమీనిని తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే మృతి చెందిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అనారోగ్యం కారణంగానే అమీని మరణించిందని తాము కొట్టలేదని పోలీసులు తెలిపారు. అయితే అమీని మరణంపై అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆమె తండ్రి అంజాద్ ఆరోపించారు. ఆమెకు ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన కుమార్తె చనిపోయాక ఆమె మృతదేహాన్ని చూడడానికి వైద్యులు అనుమతించలేదని.. శవపరీక్ష నివేదికను కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమీని పాదాలపై గాయాలున్నాయని వైద్యులకు చెప్పానని.. కానీ పట్టించుకోలేదని తెలిపారు. అమీని అనారోగ్యంతో చనిపోయిందని అధికారులు చెబుతున్నది అవాస్తవమని కొట్టిపారేశారు.
అమీనిని పోలీసులు నిర్బంధించినప్పుడు ఆమె తమ్ముడు పక్కనే ఉన్నాడని అంజాద్ తెలిపారు. పోలీసులు ఆమెను వ్యానులో కొట్టారని.. స్టేషన్‌లోనూ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తన కుమారునికి చెప్పినట్లు అంజాద్ వెల్లడించారు. పోలీసుల దుస్తులపై ఉండే బాడీ కెమేరాలను చూపించమని అడిగితే.. వాటిలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పినట్లు అంజాద్ అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. అమీని అసభ్యకరమైన దుస్తులు ధరించినందుకే అరెస్ట్ చేశామన్న ఇరాన్ అధికారుల వ్యాఖ్యలపై అంజాద్ మండిపడ్డారు. అమీని ఎప్పుడూ పొడవైన గౌను వేసుకుంటుందని తెలిపారు. అమీని వచ్చే వారం విశ్వవిద్యాలయంలో చేరాల్సి ఉందని.. సెలవులకు టెహ్రాన్ వచ్చారని చెప్పారు. ఆమె ఉంటే గురువారం 23వ పుట్టినరోజు జరుపుకునేదని తెలిపారు.
ఇరాన్‌లోని హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య 26కి పైగా ఉందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. అమీని మరణంపై విచారణ జరుపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. ఈ విషయంలో ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని మండిపడ్డారు. అమీని మృతితో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్, మాషాద్ నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చెలరేగాయి. చట్టాల పేరుతో తమను అణచివేస్తున్నారని.. వివక్షపూరిత చట్టాలకు స్వస్తి పలకాలని మహిళలు హెచ్చరించారు.
ఇవీ చదవండి: ఉక్రెయిన్ ప్రాంతాలు రష్యాలోకి.. రెఫరెండం స్టార్ట్.. బూటకమన్న ఉక్రెయిన్