ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ముదురుతున్నవేళ అణు దాడి భయాలు అధికమవుతుండటంతో.. ఐరోపాలో ప్రస్తుతం అయోడిన్ మాత్రలకు గిరాకీ బాగా పెరిగింది. అక్కడి పలు దేశాలు ఈ ఔషధాలను భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. ప్రజలు ఇప్పటికే విపరీతంగా కొనుగోలు చేయడంతో ఫిన్లాండ్‌లోని అనేక ఫార్మసీల్లో వాటి నిల్వలు నిండుకున్నాయి. ఎందుకిలా.. అసలు అణు దాడులకు, అయోడిన్ మాత్రలకు సంబంధమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా? ఆ మాత్రలకు ఓ ప్రత్యేక సామర్థ్యం ఉంది. ఒకరకమైన రేడియేషన్ నుంచి శరీరానికి అవి రక్షణ కల్పించగలవు.
రేడియోధార్మిక అయోడిన్‌తో ముప్పు
కొన్నిసార్లు అణు దాడి లేదా అణు ప్రమాదాలు జరిగినప్పుడు రేడియోధార్మిక అయోడిన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. అది మనిషి శరీరంలోకి చేరితే థైరాయిడ్ క్యాన్సర్ బారినపడే ముప్పు అధికమవుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యంపై రేడియోధార్మిక అయోడిన్ ప్రతికూల ప్రభావం ఏళ్లపాటు కొనసాగే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.
మాత్రలు ఎలా పనిచేస్తాయంటే..
అయోడిన్ మాత్రల్లో పొటాషియం అయోడైడ్ అనే రసాయనిక సమ్మేళనం ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. స్థిరమైన అయోడిన్ (పొటాషియం అయోడైడ్)తో నిండుతుంది. కాబట్టి అణు దాడి కారణంగా రేడియోధార్మిక అయోడిన్ విడుదలైనా.. అది గ్రంథిలోకి వెళ్లేందుకు ఆస్కారమే ఉండదు. తద్వారా అణు దాడుల సమయంలో కొంత రక్షణ దక్కుతుంది. అయితే రేడియేషన్ బారిన పడటానికి కొంతసేపు ముందు ఈ మాత్రలను తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.