అమెరికాలో 250 అడుగుల ఎత్తు నుంచి టెస్లా కారు లోయలో పడిన ఘటనలో ఊహించిన విషయం బయటపడింది. తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకే భారత సంతతి వ్యక్తి ధర్మేశ్ పటేల్(41).. లోయలోకి కారును పోనిచ్చాడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అసలేం జరిగిందంటే?
ఉత్తర కాలిఫోర్నియాలో పసిఫిక్ తీరంలో అతి ప్రమాదకమైన డెవిల్స్ స్లైడ్ రహదారిలో టెస్లా సూడాన్ కారు అదుపు తప్పి లోయలో పడిందని సోమవారం అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది కారులో ఉన్న వారు మృతి చెంది ఉంటారని భావించారు. మృతదేహాలను బయటకు తీయాలని సహాయక చర్యలు ప్రారంభించారు. అంతలోనే వారు బతికి ఉన్నారని గుర్తించిన సిబ్బంది.. హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. తాడు సాయంతో నలుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో 4 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడు ఉన్నారు. బాధితులను భారతీయ సంతతికి చెందిన ధర్మేశ్ పటేల్ కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. వారంతా కాలిఫోర్నియాలోని పసడేనా ప్రాంతంలో నివసిస్తారని తెలుసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కారు.. అనేక సార్లు పల్టీలు కొట్టి.. పర్వత శిఖరాలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన భార్య, పిల్లలను చంపేందుకే ఇలా చేశాడని పోలీసుల భావించారు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. ముగ్గురి హత్య, ఇద్దరు చిన్నారులను వేధించడానికి సంబంధించి వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదుకు సిద్ధమయ్యారు.