Indian High Commissioner Gurdwara : స్కాట్లాండ్లోని గ్లాస్గోలో బ్రిటన్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటనను గ్లాస్గో గురుద్వారా తీవ్రంగా ఖండించింది. గురుద్వారా అన్ని మతాలు, నేపథ్యాల వారికి స్వాగతం పలుకుతుందని పేర్కొంది.
Glasgow Gurdwara Incident : '2023 సెప్టెంబర్ 29న భారత హైకమిషనర్ గ్లాస్గో గురుద్వారాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఆయన వెంట స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నారు. గ్లాస్గో వెలుపలి నుంచి వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు హైకమిషనర్ సందర్శనకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. దీంతో హైకమిషనర్ అక్కడి నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు' అని గ్లాస్గో గురుద్వారా గురు గ్రంథ్ సాహిబ్ సిక్కు సభ తన ప్రకటనలో వివరించింది.
కొందరు 'వికృత వ్యక్తులు' ప్రార్థనా ప్రదేశానికి భంగం కలిగించారని.. ఈ విషయంపై స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు గురద్వారా తెలిపింది. దీనిపై స్కాట్లాండ్ పోలీసులు స్పందించారు. ఈ ఘటన జరగడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోందని తెలిపారు.
వ్యతిరేకించిన బ్రిటిష్ ఎంపీలు..
ఈ ఘటనను పలువురు బ్రిటీష్ ఎంపీలు కూడా ఖండించారు. ఈ విషయం తెలిసిన తర్వాత తాను ఆందోళనకు గురయ్యానని ఇండో-పసిఫిక్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అన్నే మేరీ ట్రెవెల్యన్ చెప్పారు. ప్రార్థనా ప్రదేశాల భద్రత చాలా ముఖ్యమైనదని.. యూకేలో అలాంటి ప్రదేశాలు అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.
ఈ ఘటన అవమానకరం : భారత్
స్కాట్లాండ్‌లో ఓ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని, కాన్సుల్ జనరల్‌ను అడ్డుకోవడంపై భారత్ స్పందించింది. ఇది అవమానకరమైన ఘటన అని పేర్కొంది. ఇదంతా నాన్ లోకల్ అతివాద గ్రూపులు చేసిన పనేననీ.. గురుద్వారా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. పెద్ద ఘటన జరక్కముందే భారత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది.
నిర్వాహకుల్లో ఒకరు తక్షణం స్పందించకపోయి ఉంటే విషయం మరింత తీవ్రమయ్యేదని వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతమైంది. భారత్ తరఫున ఎవరొచ్చినా వారితో ఇలాగే వ్యవహరిస్తామని వీడియోలో ఖలిస్థాన్ సానుభూతి పరులు మాట్లాడటం కనిపించింది. దీనిపై శిరోమని గురుద్వారా ప్రబందక్ కమిటీ స్పందించింది. గురుద్వారాలు అన్ని మతాలకు చెందినవనీ.. ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పేర్కొంది.
భారత హైకమిషనర్‌కు నిరసన సెగ.. గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత..