భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. అతి చిన్న వయసులో అధ్యక్ష పదవికి పోటీ చేసే భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తగా నిలవనున్నారు వివేక్ రామస్వామి(37). వివేక్ రామస్వామి కంటే ముందే భారతీయ అమెరికన్ నిక్కీ హేలి అధ్యక్ష పదవికై పోటీ పడుతున్నట్లు ప్రకటించారు.
"అమెరికా విప్లవం, ప్రపంచ, ప్రచ్ఛన్న యుద్ధాలలో గెలిచి అమెరికా ఆదర్శంగా నిలిచింది. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించాలనుకుంటున్నాను. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాను. ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రచారమే కాదు. వచ్చే తరం అమెరికన్లకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం ఇది. అమెరికాను మొదటి స్థానంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే అమెరికా అంటే ఏంటో, దాని ఆదర్శాలేంటో తిరిగి కనుక్కోవాలి. చైనా నుంచి ముంచుకొస్తున్న ముప్పును సమర్థంగా ఎదుర్కొని, దేశ అవసరాల కోసం చైనాపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాను" అని స్పష్టం చేశారు వివేక్.
కేరళకు చెందిన వ్యక్తి
వివేక్ రామస్వామి తల్లిదండ్రులు కేరళలోని పాలక్కాడ్‌లోని వడక్కంచెర్రి నుంచి అమెరికాకు వలస వచ్చారు. వివేక్ ఒహాయోలో ఆగస్టు9, 1985లో జన్మించారు. స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్ సహ వ్యవస్థాపకుడైన రామస్వామి ప్రస్తుతం ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు బయోఫార్మాస్యూటికల్ కంపెనీ రోవాంట్ సైన్సెస్‌ను స్థాపించారు. ఈయన "వోక్, ఇంక్ ఇన్‌సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్", "నేషన్ ఆఫ్ విక్టిమ్స్: ఐడెంటిటీ పాలిటిక్స్, ది డెత్ ఆఫ్ మెరిట్, అండ్ ది పాత్ బ్యాక్ టు ఎక్సలెన్స్" పుస్తకాల రచయిత కూడా. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఈయన ఒకరిగా నిలిచారు.
గత వారమే ప్రకటించిన నిక్కీ హేలీ
గత వారమే భారత సంతతికి చెందిన దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి:
ఇద్దరికీ ఒకే బాయ్‌ఫ్రెండ్.. ఒకేలా కనిపించాలని పళ్లు పీకించుకున్న కవలలు.. వీళ్ల కథ తెలుసా?
అమెరికాలో కుల వివక్షపై ఉక్కుపాదం.. అలా చేసిన మొదటి నగరంగా సియాటెల్