India Ultimateum To Canada : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ కెనడాపై మరిన్ని చర్యలకు ఉపక్రమించింది భారత్. దిల్లీలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడా ప్రభుత్వానికి భారత్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఈనెల 10లోగా 40 మంది కెనడా దౌత్య సిబ్బంది భారత్‌ను విడిచి వెళ్లాల్సిందిగా తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఒట్టావాకు భారత్ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. కాగా, ఇరుదేశాల దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం పాటించాలని భారత్ గతంలోనే కెనడాకు సూచించిన విషయం తెలిసిందే.
కెనడాతో పోలిస్తే దిల్లీలో ఎక్కువే..
ఇటీవలే నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ.. దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని ప్రస్తావించింది. ఒట్టావాలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువ అని.. దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ కెనడాకు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే భారత్ తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు గడువు కూడా విధించినట్లు సమాచారం. రాజధాని దిల్లీలో ప్రస్తుతం కెనడాకు చెందిన మొత్తం 62మంది దౌత్యసిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో 41 మంది అధికారులను ఒట్టావాకు పిలిపించుకోవాలని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
'గడువు దాటితే రక్షణ తొలగిస్తాం'..
అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలా కెనడా చర్యలు తీసుకోవాలని దిల్లీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ గడువు దాటిన తర్వాత భారత్‌లో అదనంగా పనిచేసే అధికారులకు దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ విదేశాంగ శాఖ హెచ్చరించినట్లు జాతీయ ఆంగ్లపత్రిక తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ వార్తలపై కెనడా విదేశాంగ శాఖ నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
చర్యకు ప్రతిచర్య..
నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చేసిన సంచలన ఆరోపణలతో ఈ దౌత్య వివాదానికి తెరలేచింది. ఈ క్రమంలోనే కెనడాలో పనిచేస్తున్న భారత దౌత్యవేత్తపై అక్కడి ప్రభుత్వం బహిష్కరణ వేటువేసింది. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా దిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. అంతేకాకుండా కెనడా వాసులకు వీసాల జారీని నిలిపివేస్తూ కూడా భారత్ నిర్ణయం తీసుకుంది.
India Canada Row : 'నిజ్జర్ హత్య విషయంలో అమెరికా మాతోనే'.. కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు