PM Modi Japan: భారత్, జపాన్.. సహజసిద్ధ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని చెప్పారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా మోదీ.. మొదటి రోజు టోక్యోలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.
"భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. రెండు దేశాల సంబంధాలు.. ఆధ్యాత్మికత, సహకారం, మనం అనే భావనతో కూడి ఉన్నాయి. నేటి ప్రపంచమంతా బుద్ధ భగవానుడు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. హింస, ఉగ్రవాదం, అరాచకవాదం, వాతావరణ మార్పులు లాంటి అనేక సవాళ్ల నుంచి మానవాళిని రక్షించేందుకు బుద్ధుడి మార్గమే సరైన పరిష్కారం."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
ఎంత పెద్ద సమస్య ఎదురొచ్చినా పరిష్కారాన్ని కనుగొనే సత్తా భారత్‌కు ఉందని పేర్కొన్నారు మోదీ. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, అనిశ్చితి వాతావరణం ఉండేదని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ కోట్లాది పౌరులకు 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్‌లను సరఫరా చేసిందని, వందకుపైగా దేశాలకు పంపిందని చెప్పారు. "నేను జపాన్‌ను సందర్శించినప్పుడల్లా, మీరు ఆప్యాయత చూపిస్తున్నారు. మీలో చాలా మంది జపాన్‌లో అనేక సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. ఇక్కడి సంస్కృతిని కూడా అలవరచుకున్నారు. అయితే ఇప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల మీ అంకితభావం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని మోదీ ప్రవాస భారతీయులతో అన్నారు.
'భారత్‌మాతా కీ జై' నినాదాలతో.. సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. 'మోదీ మోదీ', 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. వారితో కాసేపు మోదీ ముచ్చటించారు. చిన్నారులతోనూ మాట్లాడారు. వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను చిన్నారులు పట్టుకుని మోదీకి స్వాగతం పలికారు.
దిగ్గజ వాణిజ్య ప్రతినిధులతో భేటీ.. టెక్స్‌టైల్స్ నుంచి ఆటోమొబైల్స్ వరకు.. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు సంబంధించి 30కి పైగా జపాన్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. భారత్‌లో సులభతర వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఇటీవల చేపట్టిన సంస్కరణల గురించి జపనీస్ వ్యాపార దిగ్గజాలకు వివరించారు. సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ సుజుకీ మాట్లాడుతూ.. మోదీ జపాన్ పర్యటనను భారత్-జపాన్ దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ సంస్కరణలు వర్ణించలేనివని, ఆయన భారతదేశాన్ని మోడల్ ల్యాండ్‌స్కేప్‌గా మార్చే సంస్కరణలను తీసుకు వస్తున్నారని అని సుజుకీ అన్నారు.
క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ జపాన్ వెళ్లారు. క్వాడ్ నేతలతో విడివిడిగా కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హాజరవుతారు.
ఇవీ చదవండి: ఉక్రెయిన్ దూకుడు.. రష్యా కమాండర్‌కు జీవిత ఖైదు!
భారత్, అమెరికా సహా 12 దేశాల మధ్య 'ఇండో- పసిఫిక్ ట్రేడ్ డీల్'