Imran Khan Cipher Case : అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై నేరాభియోగాలను మోపింది ప్రత్యేక కోర్టు. ఇమ్రాన్‌తోపాటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీలపై వచ్చిన ఆరోపణలను ఇక్కడి ప్రత్యేక కోర్టు ధ్రువీకరించింది.
విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ..
Cipher case Pakistan : గతేడాది ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్ కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే ఇమ్రాన్ మెడకు చుట్టుకుంది. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
జైలులోని విచారణ..
Cipher Case Imran Khan Details : తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు గత ఆగస్టులో నిలిపివేసింది. అయితే, ఆ వెంటనే సైఫర్ కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఇమ్రాన్‌ను బయటకు తరలిస్తే భద్రతా సమస్యలు ఏర్పడతాయని భావించి.. జైల్లోనే విచారణ జరపాలని పాక్ న్యాయశాఖ నిర్ణయించింది.
అక్టోబరు 27కు విచారణ వాయిదా..
Imran Khan Latest News : ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్.. అడియాలా జైలుకే వచ్చి విచారణ చేపట్టారు. నేరారోపణ తర్వాత.. విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేశారు. ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెప్టెంబర్ 30న ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇమ్రాన్ తరఫున న్యాయవాది చెప్పారు. మరోవైపు, ఈ కేసులో నేరం రుజువైతే.. ఇమ్రాన్ ఖాన్‌కు ఉరిశిక్ష లేదా 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Imran Khan Disqualification : ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐదేళ్లపాటు అనర్హత వేటు