Germany Airport Standoff : జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌లోకి కారులో దూసుకెళ్లి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన వ్యక్తిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఫలితంగా 18 గంటల ఉత్కంఠకు తెరపడింది. అరెస్టు చేసే క్రమంలో అతడి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని తెలిసింది. 18 గంటలుగా నిందితుడి వద్దనే ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ జరిగింది
Homburg Germany Airport Hostage : ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి కారుతో హాంబర్గ్ విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. భద్రతా సిబ్బందిని దాటుకొని ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడిన అతడు.. తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆపై ఇంధనం నింపిన సీసాలకు నిప్పంటించి గాల్లోకి విసిరి బీభత్సం సృష్టించాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దుండగుడు కారును ఓ విమానం కింద పార్క్ చేశాడు. కారులో ఓ చిన్నారి కూడా ఉండటం వల్ల ఆమెను రక్షించేందుకు పోలీసులు అతడితో చర్చలు జరిపేందుకు యత్నించారు.
అయితే, కుటుంబ వివాదం కారణంగానే దుండగుడు ఇలా ప్రవర్తించినట్లు సమాచారం. తన కుమార్తెను అపహరించుకుని పోయాడంటూ అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె బాలికతో కలిసి స్టేజ్‌లో ఉండగా.. బక్ట్సెహుడ్ నుంచి వచ్చిన దుండగుడు చిన్నారిని బలవంతంగా లాక్కొనిపోయాడని జర్మన్ వార్తా సంస్థ ఎన్‌డీఆర్ పేర్కొంది. ఫలితంగా హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడి వద్ద 4 ఏళ్ల వయసున్న కుమార్తె కూడా ఉండటం వల్ల పోలీసు అధికారులు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉన్నారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సహా ఇతర విమానాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. టెర్మినల్ నుంచి ప్రయాణికులను పూర్తిగా ఖాళీ చేయించారు. 60 విమానాల రాకపోకలను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు. ఫలితంగా సుమారు 3వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.