Gaza Strip Divided : హమాస్ నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం జరిగింది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. గాజాపట్టీని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. గాజా నగరాన్ని తాము చుట్టుముట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. గాజాపట్టీని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించినట్లు వెల్లడించారు. ఈ యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. తాము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే తమ దళాలు గాజా నగర తీర ప్రాంతానికి చేరుకున్నాయని తెలిపారు. ఉత్తర గాజాలో ఉన్న పౌరులు దక్షిణగాజాకి చేరుకోవడానికి ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదివారం రాత్రి జరిపిన దాడిలో హమాస్ ఔట్‌పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 450 టార్గెట్లపై తమ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వెల్లడించింది. గాజాలో మెుబైల్, ఇంటర్నెట్ సేవలకు మళ్లీ అంతరాయం కలిగినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ దళాల దాడులతో ఇప్పటివరకు 10 వేల మంది మృతి చెందారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.
Israel Gaza War Updates : మరోవైపు మధ్య ఆసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పాలస్తీనా, ఇరాక్, అధ్యక్షులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ ఇప్పటికే సమావేశమయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ పోరుపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పశ్చిమాసియా విదేశాంగ మంత్రులతో మాట్లాడుతారని శ్వేతసౌధం తెలిపింది. గాజా పౌరులకు మానవతా సాయాన్ని పెంచేందుకు ఆమె కృషి చేస్తారని పేర్కొంది. మానవతా సంక్షోభ నివారణకు తక్షణం కాల్పుల విరమణను పాటించాలని ఐరాసకు చెందిన పలు సంస్థలు అధిపతులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ కార్ల వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
అక్టోబర్ 7నాటి నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో హమాస్ దాడుల్లో ధ్వంసమైన కార్ల వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. కిబ్బజ్ట్ బీరీ నోవా సంగీత కచేరీతోపాటు ఇతర ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు ధ్వంసం చేసిన వాహనాలు అన్నిటినీ అదేచోట పేర్చింది. ఇక్కడ కనిపిస్తున్న వాహనాల్లో కొన్ని పాక్షికంగా ధ్వంసం కాగా.. మరికొన్ని పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఆ వాహనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
Israel Gaza Conflict News : ఈ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను వెతికేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాడి ఎలా జరిగిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. బూడిదైన కార్లలో మానవ అవశేషాలు ఏమైనా లభిస్తాయా అని వెతుకుతున్నారు. పూర్తిగా గల్లంతైన తమ కుటుంబీకులు, స్నేహితుల అవశేషాల కోసం ఇజ్రాయెల్ ప్రజలు గాలిస్తున్నారు. వాటితో సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నారు.
అక్టోబర్ 7న శబ్బత్ పండుగ సందర్భంగా వందలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు కిబ్బట్జ్‌బీరీ ప్రాంతంలో వేడుకలు నిర్వహించుకున్నారు. అదే సమయంలో ఓ వైపు వేలాది రాకెట్లను ప్రయోగిస్తూనే మరోవైపు.. నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. ట్యాంకర్లు, మిషిన్ గన్‌లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వందల మంది మరణించారు. చాలామంది ఈ కార్లలో చనిపోయినవారిగా నటించి ప్రాణాలు కాపాడుకున్నారు.
శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి- 52 మంది మృతి, ప్రపంచ దేశాల ఆందోళన
అంబులెన్స్ కాన్వాయ్‌పై వైమానిక దాడి- తీవ్రంగా భయపడ్డానన్న ఐరాస చీఫ్!