EU Sanctions On Russia: ఉక్రెయిన్‌పై దుందుడుకు దాడులకు తెగబడుతున్న రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఐరోపా సమాఖ్య దేశాలు సిద్ధమయ్యాయి. రష్యాపై.. ఆరో విడత ఆంక్షల జాబితాను సిద్ధం చేసిన ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయాన్.. దానిని ఐరోపా పార్లమెంటుకు సమర్పించారు. రష్యా చమురు దిగుమతులపై.. దశలవారీగా ఆంక్షలు విధించడం ఈ ప్రతిపాదనల్లో.. ప్రధాన అజెండాగా ఉంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపేసేందుకు.. ఈయూలోని 27 సభ్య దేశాలకు 6 నెలల సమయం, సంబంధిత ఉత్పత్తులకు స్వస్తి చెప్పేందుకు.. 8 నెలల సమయం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రష్యా చమురుపై ఆధారపడటాన్ని ఐరోపా దేశాలు ముగిస్తున్నట్లు ఈయూ చీఫ్ ప్రకటించారు. ఇది చెప్పినంత సులభం కాకపోయిన.. చేసి తీరాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
చమురు ఆంక్షలతో సరిపెట్టకుండా.. రష్యాకు చెందిన అత్యున్నత సైన్యాధికారులను లక్ష్యంగా చేసుకోవాలని ఈయూ చీఫ్ సూచించారు. ముఖ్యంగా.. ఉక్రెయిన్‌లోని బుచా, మరియూపోల్‌లో యుద్ధ నేరాలకు పాల్పడిన ఆర్మీ జనరల్స్‌పై.. చర్యలకు పట్టుబట్టాలని ఆంక్షల జాబితాలో పేర్కొన్నారు. యుద్ధ నేరాలకు తెగబడిన అధికారులు ఎవరో తమకు తెలుసన్న ఈయూ చీఫ్.. వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. అలాగే రష్యా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన.. స్బెర్ బ్యాంకును స్విఫ్ట్ సేవల నుంచి తొలగించటం, యుద్ధంపై అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న మూడు రష్యా బ్రాడ్‌కాస్ట్ ఛానళ్లకు శాటిలైట్, ఇంటర్నెట్ సేవలను తొలగించటం వంటి ప్రతిపాదనలు చేశారు.
రష్యా ప్రభుత్వంపైనే గాక.. ఆ దేశ ప్రభుత్వాధినేతలపైనా ఆంక్షలు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా చట్టసభ్యులతో పాటు.. ఉక్రెయిన్ వేర్పాటువాదులతో కూడిన 110 మంది వ్యక్తులపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. రష్యాలోని.. డూమా రాష్ట్ర అసెంబ్లీకి చెందిన 76 మంది సభ్యులు, 34మంది ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై.. ఆర్థిక ఆంక్షలతో పాటు, ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ వేర్పాటువాదులు.. అక్కడి ప్రభుత్వాన్ని ధిక్కరించడం వల్ల పాటు ఆ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లఘించారని ఆస్ట్రేలియా పేర్కొంది.
ఇదీ చదవండి: Russia Ukraine War: యుద్ధానికి 'అధికార ముద్ర'.. ఆరోజే పుతిన్ ప్రకటన?