Costliest watermelon: ఎరుపు రంగు ముక్కలమీద నల్లటి గింజలతో చూడగానే నోరూరించే పుచ్చపండు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. వేసవి వచ్చిందంటే దీనికుండే డిమాండే వేరు. సామాన్యులు సైతం కొనుక్కోగలిగే ధరల్లో ఇవి లభ్యమవుతాయి. ఎంత సీజనైనా కేజీ పుచ్చకాయ ధర కేజీ రూ. 100 మించదు. కానీ ఇప్పుడు చెప్పబోయే పండు ధర వింటే కచ్చితంగా షాకవుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా దీనికి పేరు. మార్కెట్లో ఒక కాయ ధర రూ. 19 వేల నుంచి రకాన్ని బట్టి రూ. 4లక్షల వరకూ పలుకుతుంది. అన్నట్టు దీనిపేరిట ఓ గిన్నీస్ రికార్డు కూడా ఉందండోయ్. ఇంతకీ ఏమిటా పండు ప్రత్యేకత? ఎందుకంత ధర అంటారా?..
Watermelon news: సాధారణంగా లేత, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉండే పుచ్చకాయలే మనకు తెలుసు. కానీ నల్లగా నిగనిగలాడే పుచ్చకాయలు చాలా అరుదుగా కనిపిస్తాయి. జపాన్ దేశంలో 'డెన్సుకే వాటర్‌మెలన్'గా పిలుచుకునే రకాలను పండిస్తారు. ఫుట్‌బాల్ ఆకారంలో గుండ్రంగా ఉండే వీటిని కొనడానికి ఇతర దేశాలవారూ ఎంతో ఆసక్తి చూపుతారు. రూపులో మాత్రమే కాదు రుచిలోనూ వీటికి సాటి లేదని కొనుగోలు చేసిన వారు చెప్తారు. మార్కెట్లో లభ్యమయ్యే సాధారణ రకాలకన్నా ఎన్నో రెట్లు తీయగా ఉండటమే కాకుండా పోషకవిలువల్లోనూ మేటి అంటున్నారు వీటిని సాగు చేసే రైతులు. అయితే వీటిని పండించడం అంటే కత్తిమీద సామేనట. పూత దగ్గర నుంచి కోత కోసే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీనికి అనువైన వాతావరణం అంతటా ఉండదు. అందుకే ఏటా కేవలం కొన్ని పండ్లను మాత్రమే పండించగలుగుతారు. ధర సంగతి ఎలా ఉన్నా వీటిని కొనేందుకు పోటీ పడుతుంటారు. కొన్ని సార్లు వేలం ద్వారా కొనుగోలు చేస్తుంటారు. వీటిని శుభకార్యాలు ఇతర వేడుకల్లో బహుమతులుగా ఇస్తారు. అందుకు అనువుగా వీటి ప్యాకింగ్ కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. దానిపై ఈ ప్రత్యేక పళ్ల రకం నాణ్యతను సూచించేలా ఓ లేబుల్‌ను కూడా అతికిస్తారు.
ఇదీ చదవండి: గాలి, సౌరశక్తితో నీటి తయారీ.. శాస్త్రవేత్తల అద్భుత సృష్టి