US Midterm Elections: అంచనాలను తలకిందులు చేసే రీతిలో అమెరికా చట్టసభల ఉప ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లు విజయపథంలో దూసుకుపోతున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రజామోదం కొంత తగ్గిందనీ, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఆయన పార్టీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చనే అంచనాలు తొలుత వెలువడిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో ఆ పరిస్థితి కనిపించకపోయినా మొత్తంమీద అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు పట్టు సాధించగలుగుతారా అనే స్పష్టత ఇంకా రావడం లేదు.
ఛాంబర్‌పై పట్టుకు కీలకమైన స్థానాల్లో రిపబ్లికన్లపై డెమోక్రాట్లు విజయఢంకా మోగిస్తుండడం అధికార పార్టీలో ఆనందోత్సాహాలు నింపుతోంది. వర్జీనియా నుంచి కాన్సాస్ వరకు అనేక జిల్లాల్లో స్థానాలను డెమోక్రాట్లు నిలబెట్టుకున్నారు. గవర్నర్లుగానూ ఆ పార్టీ నేతలు నెగ్గుతున్నారు. విస్కాన్సిన్, మిషిగాన్, పెన్సిల్వేనియా వంటివి బైడెన్‌కు పట్టున్న రాష్ట్రాలు కాగా వాటిల్లో గవర్నర్లుగా అధికార పార్టీ బలపరిచినవారే వచ్చారు.
ఆశలు వదులుకోని రిపబ్లికన్లు
ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియాల్లో రిపబ్లికన్లు నెగ్గుకువచ్చారు. ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కానందువల్ల కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించడానికి రిపబ్లికన్లకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. తుది ఫలితాల్లో ఆధిక్యం తమకే ఉంటుందని రిపబ్లికన్ నేత కెవిన్ మెక్‌కర్తి ఆశాభావం వ్యక్తంచేశారు. దేశవ్యాప్త అంచనాలను తోసిరాజని తమ పార్టీ ప్రతినిధులు బలపడ్డారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు.
రెండు సభల ఫలితాలు బైడెన్ పాలనకు రిఫరెండంగా పనిచేయడంతో పాటు అధికార పార్టీ ఎజెండా భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఒకవేళ రిపబ్లికన్లే ఎక్కువ సంఖ్యలో నెగ్గితే మాత్రం బైడెన్‌పై, ఆయన కుటుంబంపై విచారణలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అటు సెనెట్‌లో న్యాయపరమైన నియామకాలకు అడ్డంకులు ఎదురుకానున్నాయి. అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ తమ హయాంలో తొలి మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చెందడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి దానికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విజేతల్లో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా
భారతీయ అమెరికన్లలో ఐదుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త రికార్డు సృష్టించారు. ప్రతినిధుల సభలో ఇంతవరకు గరిష్ఠంగా నలుగురు ఉండేవారు. రాజా కృష్ణమూర్తి (49) డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా నాలుగోసారి విజయం సాధించారు. ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అధికార పార్టీ తరఫున రో ఖన్నా, ప్రమీలా జయపాల్ (జన్మస్థలం చెన్నై) కూడా ప్రతినిధుల సభకు వరసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. తమతమ స్థానాల్లో పోలైన ఓట్లలో ఖన్నాకు 70%, జయపాల్‌కు 85% పైగా లభించాయి.
దిల్లీలో పుట్టిన కృష్ణమూర్తి తొలిసారిగా 2016లో కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. ఉత్తమ భవితవ్యం కోసం తమ తల్లిదండ్రులు అమెరికాకు ఎలా వచ్చారో అలా తరతరాలుగా వచ్చి ఉంటున్నవారికి, కొత్తగా వస్తున్నవారికి తగిన అవకాశాలు కల్పిద్దామని ఆయన తాజాగా పిలుపునిచ్చారు. మిషిగాన్ నుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా శ్రీథానేదార్ నిలిచారు. అత్యంత సీనియర్ రాజకీయ నేతగా ఉన్న అమీ బెరా ఆరోసారి విజేతగా అవతరించబోతున్నారు. తన ప్రత్యర్థి కంటే 12% పైగా ఓట్ల తేడాతో ఆయన కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మొత్తంమీద దాదాపు 1670 కోట్ల డాలర్లు ఖర్చయి ఉంటాయని అంచనా. అత్యంత ఖరీదైన మధ్యంతర ఎన్నికలుగా ఇవి నిలిచిపోనున్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు
'కాప్-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!