Cuba oil reserves: ఒక్క పిడుగుపాటు క్యూబాను అస్తవ్యస్తం చేసింది. ఆ దేశ ప్రధాన చమురు నిల్వల్లో 40శాతం అగ్నికి ఆహుతి చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ అగ్నిమాపక విభాగం మంగళవారం వెల్లడించింది. మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులోని నాలుగు ట్యాంక్‌లు పూర్తిగా దగ్ధమైపోయాయి. క్యూబాలోనే అత్యధిక చమురును దిగుమతి చేసుకోగల పోర్టు ఇదే కావడం గమనార్హం. ఇక 10 భారీ ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే చమురును ప్రధానంగా విద్యుత్తు తయారీకి వినియోగిస్తారు.
శుక్రవారం ఈ పోర్టులోని ఓ ట్యాంకర్‌పై పిడుగుపడి మంటలు అంటుకొన్నాయి. ఆదివారం నాటికి ఆ మంటలు రెండో ట్యాంక్‌కు వ్యాపించాయి. సోమవారం మొత్తం నాలుగు ట్యాంకులు ఈ దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేయడానికి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి తోడు మెక్సికో, వెనుజువెలా నుంచి కూడా 100 మంది సిబ్బందిని తరలించారు. మంగళవారం మెక్సికో నుంచి మరిన్ని హెలికాప్టర్లు, ఫైర్‌బోట్స్‌ను పంపారు. ప్రమాద స్థలం దగ్గరకు వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారుతోంది. మంటలు నిలకడగా కొనసాగుతుండటంతో సమీపంలోకి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే అమెరికా ఆంక్షల చట్రంలో ఉన్న క్యూబా దివాల అంచున ఉంది. ఇక్కడ తరచూ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు చోటు చేసుకొంటున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనల బాట పట్టడం సర్వసాధారణమైపోయింది. తాజా ప్రమాదం పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉంది. సమీపంలోని మతంజాస్ బేలో ఉన్న చమురు మాత్రం కలుషితం కాలేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. భారీగా కాలుష్యం వ్యాపించడంతో ప్రజలు మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆమ్ల వర్షాలు కూడా కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే క్రమంలో శనివారం ఓ ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 14 మంది సిబ్బంది జాడ గల్లంతైంది. ఈ ప్రమాదం కారణంగా వెలువడ్డ పొగ దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోని హవాన వరకు వ్యాపించింది.
ఇవీ చదవండి: చైనాలో మరో కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి.. టీకాలూ లేవ్!