China Interest Rates: సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న స్థిరాస్తి రంగానికి ఊతం లభించేలా చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అదుపు తప్పిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచుతుండగా చైనా మాత్రం తగ్గిస్తోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గించింది. ఈ నిర్ణయంతో సంక్షోభం నుంచి స్థిరాస్తి రంగానికి డ్రాగన్ చేయూతను అందించింది.
కరోనా మహమ్మారి విలయ తాండవంతో చైనాలో కొనుగోళ్లు నిలిచిపోయి ఆ దేశ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలయ్యింది. చాలా దిగ్గజ సంస్థలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని నగదును చలామణిలోకి తీసుకురావడం వల్ల రుణ వితరణ జరిగి ద్రవ్య లభ్యత అధికమవుతుందని చైనా భావిస్తోంది.
భారత్‌కు కలిసొచ్చేనా?
చైనా స్థిరాస్తి సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులు.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు తరలే అవకాశం ఉంది. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు చైనాకు వెళ్లకపోవచ్చు. ఈ కోణంలో చైనా సంక్షోభం.. భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్‌లోకి చైనాకు వెళ్లాల్సిన పెట్టుబడులన్నీ తరలి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు పుంజుకుంటే మార్కెట్లకు మరింత దన్ను లభిస్తుంది. చైనాలో సంక్షోభం వల్ల అక్కడ కమొడిటీ ధరలు దిగొస్తున్నాయి. ఇది భారత స్థిరాస్తి రంగానికి కలిసొచ్చే అవకాశం ఉంది. భారత్‌కు తరలివచ్చే విదేశీ పెట్టుబడులు దేశ స్థిరాస్తి రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏ కోణంలో చూసినా.. భారత స్థిరాస్తి రంగం, చైనాతో పోలిస్తే మెరుగైన స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: లంకను వీడిన చైనా నిఘా నౌక, ఆరు రోజులు అక్కడే
భారత్లోని కీలక నేతపై ఉగ్రదాడికి కుట్ర, రష్యాలో ఐఎస్ సూసైడ్ బాంబర్ అరెస్ట్