Queen Elizabeth2 Funeral : మహారాణి ఎలిజబెత్-2 మరణంతో బ్రిటన్ శోకసముద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. రెండు వారాల్లోనే చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబేలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారని, త్వరలోనే ఈ తేదీ ఖరారు కానుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏడు దశాబ్దాలకుపైగా బ్రిటన్‌ను పాలించిన ఎలిజబెత్-2... స్కాట్‌లాండ్‌లోని తన వేసవి విడిది బల్మోరల్ క్యాజిల్‌లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సెయింట్ పాల్స్ క్యాథడ్రల్‌లో శుక్రవారం నిర్వహించిన మహారాణి జ్ఞాపకార్థ ప్రార్థనలకు ప్రధాని లిజ్ ట్రస్, సీనియర్ మంత్రులు హాజరయ్యారు.
అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారి..
బ్రిటన్‌లో అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 1965లో చివరగా బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ అంత‌్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఎలిజబెత్-2 భర్త.. ఫిలిప్ అంత్యక్రియలు కూడా రాజ కుటుంబం లాంఛనాలతో నిర్వహించారు. 1952లో బ్రిటన్ రాణి తండ్రి జార్జ్-6 అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపారు. అయితే 295ఏళ్లలో తొలిసారి రాజు ఎడ్వర్డ్-8 అంత్యక్రియలు మాత్రమే అధికార లాంఛనాలతో జరగలేదు. ఆయన పదవి నుంచి తప్పుకోవటం వల్ల అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు.
ఇవీ చదవండి: దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే తక్షణమే అణ్వాయుధ దాడి.. సైన్యానికి కిమ్ కొత్త అధికారాలు!
'స్వదేశానికి వెళ్లిపో..!' భారతీయ-అమెరికన్ చట్టసభ్యురాలికి బెదిరింపులు!!