డాన్‌బాస్ ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్న రష్యాను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్ చేతికి అమెరికా అత్యాధునిక రాకెట్ లాంఛర్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ధ్రువీకరించారు. ఉక్రెయిన్ గురిచూసి దాడి చేసే సామర్థ్యాన్ని అత్యాధునిక రాకెట్లు మరింత పెంచుతాయన్నారు. అయితే.. ఈ రాకెట్లతో రష్యా భూభాగంలో ఎలాంటి దాడులు చేయబోమని ఉక్రెయిన్ హామీ ఇవ్వడంతో బైడెన్ గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
‘‘అమెరికా లక్ష్యం స్పష్టంగా ఉంది. మేము స్వతంత్ర, ప్రజాస్వామిక,సార్వభౌమిక, సంపన్న ఉక్రెయిన్‌ను చూడాలి. ఇది సాధ్యం కావాలంటే.. దురాక్రమణదారుల నుంచి ఆత్మరక్షణ చేసుకొనేట్లు ఉండాలి. మేము నాటో-రష్యా మధ్య యుద్ధాన్ని కోరుకోవడంలేదు’’ అని బైడెన్ పేర్కొన్నట్లు న్యూయార్క్‌టైమ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు ఈ వారమే ఉక్రెయిన్‌కు చేరుకోనున్నాయి.
మరోపక్క ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి ఆయుధాలు ఇచ్చే దేశం.. రష్యా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని గత శుక్రవారం రష్యా విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లావ్రోవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్ దాని సరిహద్దులు దాటి దాడులు చేయడాన్ని మేము ఏ మాత్రం ఉపేక్షించం’’ అని పేర్కొన్నారు.
ఈ రాకెట్ వ్యవస్థ ఏమిటీ..?
అమెరికా హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (హెచ్‌ఐఎంఏఆర్‌ఎస్)ను సరఫరా చేయనుంది. ఈ రాకెట్ లాంఛర్లు వాహనాలపై అమర్చి ప్రయోగిస్తారు. వీటిని ఎం142 రాకెట్ వ్యవస్థలు అంటారు. ఒక సారి దాడి చేశాక.. శత్రువు పసిగట్టి ఎదురు దాడి చేయకుండా.. అక్కడి నుంచి వేగంగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా వద్ద ఎం270, ఎం142 రకం లాంఛర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎం142 వేరియంట్ రకంలో స్టాండర్డ్ రాకెట్లు 186 మైళ్ల దూరంలోని లక్ష్యాలను.. ప్రత్యేకమైన రాకెట్లు 310 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.
ఇదీ చూడండి: ఈయూ కీలక నిర్ణయం.. రష్యాకు మరో పెద్ద దెబ్బ.. ఇప్పుడిక పుతిన్ ఏం చేస్తారో?