ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. రష్యా క్షిపణులతో కీవ్ పై విరుచుకుపడిన నేపథ్యంలో సోమవారం రాత్రి బైడెన్-జెలెన్‌స్కీ ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను బైడెన్ ఖండించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. రష్యావి మతిలేని చర్యలని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు అవసరమైన సాయం చేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందిస్తామని చెప్పారని శ్వేత సౌధం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు రష్యా యుద్ధానికి తగిన మూల్యం చెల్లించేలా మిత్రదేశాలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా జెలెన్‌స్కీకి వివరించారు. నేడు బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ7 అత్యవసర భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.
అయితే.. ఏ రకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడితో బైడెన్ చర్చించారో మాత్రం శ్వేతసౌధం వెల్లడించలేదు. గతంలో ఉక్రెయిన్‌కు నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్స్(ఎన్‌ఏఎస్‌ఏఎంఎస్)ను ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఎన్‌ఏఎస్‌ఏఎంఎస్ వ్యవస్థ రష్యా క్రూజ్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కోగలదు.
ఈ సందర్భంగా ఓ అమెరికా సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ గతంలో అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు తరలించిన కొన్ని ఆయుధాల వివరాలను వెల్లడించారు. వీటిల్లో 1,400 స్టింగర్ క్షిపణులు, నిఘా, మల్టిపుల్ మిషన్ రాడార్లు అందించారు. దీంతోపాటు మిత్రదేశమైన స్లొవాకియా సాయంతో ఎస్-300 వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇచ్చారు. దీంతో పాటు ఆగస్టులో బైడెన్ మరో ప్యాకేజీని ప్రకటించారు. వీటిల్లో 8 ఎన్‌ఏఎస్‌ఏఎంఎస్ వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో రెండు వ్యవస్థలు రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబాతో సోమవారం మట్లాడారు.
రష్యా డిమాండ్ తిరస్కరిస్తూ భారత్ ఓటు.
ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండిస్తూ.. అల్బానియా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. మాస్కో డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్ సహా 107 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఓటు వేశాయి. రష్యాకు అనుకూలంగా 13 దేశాలు ఓటు వేయగా.. 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిల్లో రష్యా, చైనా కూడా ఉన్నాయి. ఈ పరిణామాలపై ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐరాస సభ్యత్వం భారీ మోసానికి చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష స్థానంలోని వ్యక్తి ఇందుకు కీలక సూత్రధారి అని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి తమకు అవకాశం ఇవ్వలేదని వాలిల్లీ విమర్శించారు. సభ్యదేశాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పే హక్కును దోచుకొన్నారని మండిపడ్డారు..
ఇవీ చదవండి: భారత్ చేతికి స్విస్ ఖాతాల నాలుగో జాబితా.. పెరిగిన లక్ష అకౌంట్లు
'తైవాన్ను చైనాకు అప్పగించండి!'.. మస్క్ మరో శాంతి మంత్రం.. మండిపడ్డ ఇరుదేశాలు