"9/11 మారణహోమానికి కుట్ర రచించడంలో అతడు కీలక వ్యక్తి. అమెరికా భూభాగంపై 2,977 మందిని బలిగొన్న దాడులకు బాధ్యుల్లో ముఖ్యుడు. అమెరికన్లే లక్ష్యంగా దశాబ్దాలుగా జరుగుతున్న అనేక దాడులకు సూత్రధారి. అతడు ఎప్పటికీ ఈ లోకంలో లేకుండా చేసే లక్షిత దాడికి నేను ఆదేశాలు ఇచ్చా. ఇప్పుడు న్యాయం జరిగింది. ఆ ఉగ్రవాద నాయకుడు ఇక లేడు. ఆ కిరాతక హంతకుడికి ప్రపంచ ప్రజలెవరూ ఇక భయపడాల్సిన పని లేదు. మా ప్రజలకు ముప్పు కలిగించే వారు ఎంతకాలం, ఎక్కడ దాక్కున్నా.. వారి అంతుచూస్తామన్నది సుస్పష్టం."
--జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహరీని కాబుల్‌లో డ్రోన్ ద్వారా సీఐఏ మట్టుబెట్టిందని ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగం సారాంశం ఇది. బైడెన్ మాటలు వింటే అనేక అనుమానాలు కలుగుతాయి? అసలు ఎవడీ జవహరీ? సెప్టెంబర్ 11 దాడుల్లో అతడి పాత్ర ఏంటి? అతడ్ని హతమార్చి, నాటి దాడుల మృతుల కుటుంబాలకు 'న్యాయం' చేసేందుకు 21 ఏళ్లు ఎందుకు పట్టింది? అధినేత మృతితో అల్‌ఖైదా భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకోసం..
ఎవడీ అయ్మన్ అల్ జవహరీ?
అయ్మన్ అల జవహరీ పేరును చాలా మంది పెద్దగా విని ఉండకపోవచ్చు. కానీ 9/11 దాడుల్ని చూసిన వారిలో చాలా మందికి అతడి ముఖం గుర్తుండే ఉంటుంది. నాటి మారణహోమానికి ప్రధాని సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ ఫొటోల్లో అతడి పక్కనే కళ్లజోడుతో, నవ్వుతూ కనిపించే వ్యక్తే.. జవహరీ. ఆ నవ్వు వెనుక.. 2,977మందిని బలిగొన్న పైశాచికం, అమెరికా సహా అనేక దేశాలపై విద్వేషాగ్ని దాగి ఉన్నాయి.
అల్ జవహరీ స్వస్థలం ఈజిప్ట్‌లోని కైరో. 1951 జూన్ 19న పుట్టాడు. చిన్నప్పటి నుంచే మతపరమైన ఆలోచనలు ఎక్కువ. ఈజిప్ట్ సహా ఇతర అరబ్ దేశాల్లో ప్రభుత్వాల్ని గద్దె దించి, కఠినమైన ఇస్లామిక్ పాలన తీసుకురావాలని అనుకునే హింసాయుత భావజాలంతో పెరిగాడు. యువకుడిగా ఉన్నప్పుడు కళ్ల శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశాడు. అదే సమయంలో మధ్య, పశ్చిమాసియాలో విస్తృతంగా పర్యటించాడు. సోవియట్ ఆక్రమణదారులపై ఆఫ్గన్ల యుద్ధాన్ని చూశాడు. అప్పుడే బిన్ లాడెన్‌తో స్నేహం కుదిరింది. సోవియట్ దళాల్ని వెళ్లగొట్టేందుకు అఫ్గానిస్థాన్‌కు సాయం చేస్తున్న అరబ్ మిలిటెంట్లనూ కలిశాడు జవహరీ.
1981లో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ హత్య తర్వాత వందల మంది మిలిటెంట్లను జైలులో వేశారు. వారిలో జవహరీ ఒకడు. అప్పుడే అతడిలోని అతివాద భావజాలం మరింత తీవ్రమైంది. ఏడేళ్ల తర్వాత బిన్ లాడెన్ అల్ జవహరీ అల్ ఖైదాను స్థాపించినప్పుడు పక్కనే ఉన్నాడు జవహరీ. తన మిలిటెంట్ గ్రూప్‌ను అల్ ఖైదాలో విలీనం చేసేశాడు. తన అనుభవం, నైపుణ్యాలతో అల్ ఖైదా శ్రేణులకు శిక్షణ ఇచ్చాడు. ఫలితంగా అల్ ఖైదా అనేక దేశాల్లో అనుచరుల్ని పెంచుకుని, దాడులు చేయగలిగింది.
అల్ జవహరీ ఎందుకు అంత కీలకం?
సెప్టెంబర్ 11 దాడుల అమల్లో కీలక పాత్ర పోషించాడు జవహరీ. ఆత్మాహుతి దళాల్ని సిద్ధం చేశాడు. నిధులు సమకూర్చాడు. ప్రణాళికలు రచించాడు. ఆ మారణహోమం తర్వాత అమెరికా ఉగ్రవాదంపై పోరును తీవ్రం చేసినా.. అల్ ఖైదా ఉనికి కొనసాగేలా జవహరీ, అతడి అనుచరులు జాగ్రత్తపడ్డారు. అఫ్గాన్-పాక్ సరిహద్దులో అల్ ఖైదా నాయకత్వాన్ని, స్థావరాన్ని పున:నిర్మించాడు. 9/11 తర్వాత అనేక ఏళ్లపాటు బాలీ, మొంబాసా, రియాద్, జకార్తా, ఇస్తాంబుల్, మాడ్రిడ్, లండన్ సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు చేయించాడు. 2005లో లండన్‌లో 52 మందిని బలిగొన్న దాడులకు జవహరీనే సూత్రధారి.
అల్ ఖైదా అధినేతను ఎలా మట్టుబెట్టారు?
అల్ జవహరీ అంతు చూసేందుకు 2011 నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. ఎట్టకేలకు ఇప్పటికి కుదిరింది. తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఓ ఇంట్లో అతడు ఉంటున్నట్లు అగ్రరాజ్య నిఘా విభాగం గుర్తించింది. జవహరీ కదలికలపై పూర్తిగా అవగాహనకు వచ్చింది. అతడు అప్పుడప్పుడు బయటకు వచ్చి, బాల్కనీలో కాసేపు గడుపుతున్నట్లు తెలుసుకుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధరించుకున్నాక.. ప్రణాళిక ఖరారు చేసింది. బైడెన్ అనుమతి పొందింది.
కాబుల్‌లోని ఆ ఇంట్లో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు జవహరీ. ఎప్పటిలానే ఇంటి బాల్కనీలోకి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న అమెరికన్ డ్రోన్.. రెండు హైల్ఫైర్ క్షిపణుల్ని ప్రయోగించింది. అంతే.. జవహరీ ఖేల్ ఖతం. ఆ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నా.. ఎవరికీ ఏమీ కాలేదని, జవహరీ ఒక్కడే మరణించాడని అమెరికన్ అధికారులు చెప్పారు.
నాయకుడు ఖతం.. మరి అల్ ఖైదా భవితవ్యం?
జవహరీ వారసుడు ఎవడన్నదానిపైనే అల్ ఖైదా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అమెరికా, ఇతర దేశాలు అనేక ఏళ్లుగా చేస్తున్న దాడులతో ఇప్పటికే ఆ ఉగ్రమూక చాలా వరకు దెబ్బతింది. అల్ ఖైదా మనుగడ కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం. 9/11 తర్వాత పుట్టుకొచ్చిన అతివాద సంస్థలతో వైరం.. పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణాసియాలోని పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఉగ్రమూకల కన్నా స్థానిక జిహాదీ సంస్థలకే ఆదరణ పెరగడం వంటివి ఇందుకు కారణమన్నది వారి విశ్లేషణ.
జవహరీ అఫ్గానిస్థాన్‌లో ఉన్నట్లు తాలిబన్లకు తెలుసా?
"అందులో అనుమానమే లేదు" అని అంటున్నారు అమెరికా అధికారులు. జవహరీ ఉన్న ఇల్లు కూడా తాలిబన్ సీనియర్ నాయకుడిదే. అయితే.. తాలిబన్లలో కొందరు కావాలనే అతడి ఆచూకీని అమెరికాకు అందజేసి ఉంటారని అనుమానం. అయితే.. 1990లలో అల్ ఖైదా నేతలకు ఆశ్రయమిచ్చి, సెప్టెంబర్ 11 దాడులకు ప్రణాళికలు రచించేందుకు సాయం చేసింది అఫ్గానిస్థాన్‌లో అప్పటి తాలిబన్ల ప్రభుత్వమేనని మరిచిపోరాదు. ఇప్పుడు అదే తరహాలో అతివాద సంస్థలకు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ఆశ్రమిస్తున్నారా అనేది అమెరికా సహా అనేక దేశాల ఆందోళన.