Al Shifa Hospital Gaza News : గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా కేంద్రంగా ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఆసుపత్రి గేటు బయట తీవ్ర ఘర్షణ జరుగుతుండగా.. లోపల విద్యుత్ సరాఫరా లేక చీకట్లోనే రోగులు, శిశువులు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. శిశువులను, ఇతరులను తరలించేందుకు అవకాశమిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా.. అదంతా ఒట్టిదేనని గాజాలోని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
మరోవైపు, గాజా స్ట్రిప్‌పై హమాస్ పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ ప్రకటించారు. ఉగ్రవాదులంతా దక్షిణ గాజా వైపు పారిపోతున్నారని తెలిపారు. ప్రజలంతా హమాస్ స్థావరాలను ఆక్రమిస్తున్నారని గాజా ప్రజలకు అక్కడి ప్రభుత్వంపై ఏ మాత్రం నమ్మకం లేదని వెల్లడించారు. అయితే, గాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని నిరూపించడానికి ఆయన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు.
'ఆసుపత్రి శ్మశానంలా మారిపోయింది..'
మరోవైపు అల్ షిఫా ఆసుపత్రి వద్ద పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. అల్-షిఫా ఆసుపత్రిని శ్మశానవాటికగా అభివర్ణించింది. ఆసుపత్రి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని.. వాటిని ఖననం చేయలేకపోతున్నారని.. మార్చురీకి కూడా తరలించలేకపోతున్నారని WHO ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఇక సాధారణంగా వైద్య సేవలు అందించలేదని.. ఇప్పటికే అది దాదాపుగా స్మశానంలా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం అల్-షిఫా ఆసుపత్రిలో 1500 మంది రోగులున్నారు. మరో 1500 మంది వైద్య సిబ్బంది, 20 వేల మంది వరకు శరణార్థులు ఉన్నారని లిండ్‌మీర్ వెల్లడించారు.
'కుక్కలు పీక్కు తింటున్నాయి..'
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను తరలించేందుకు, ఖననం చేసేందుకు అవకాశం లేకపోవడం అవి కుళ్లిపోతున్నాయని.. ఆ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కుళ్లిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని ఆసుపత్రిలోని డాక్టర్ మొహమ్మద్ అబు సెల్మియా వెల్లడించారు. కుక్కలు ఆసుపత్రి పరిసరాల్లోకి ప్రవేశించి మృతదేహాలను పీక్కు తింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అల్-షిఫా ఆసుపత్రికి కొన్ని రోజులుగా విద్యుత్, నీళ్ల సదుపాయం కూడా లేదని.. బయట కాల్పులు, బాంబుల మోతలతో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వైద్యులు వాపోయారు.
'ఆసుపత్రిని రక్షించాల్సిన అవసరం ఉంది..'
అల్-షిఫా ఆసుపత్రి కేంద్రంగా కొనసాగుతున్న పరస్పర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అల్-షిఫా ఆసుపత్రిని తప్పనిసరిగా రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దళాలు ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోవని ఆశిస్తున్నట్లు బైడెన్ అన్నారు. అత్యవసర వైద్య సాయం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
'హమాస్‌కు రక్షణ కవచాలుగా ఆస్పత్రులు- ఇంధనం ఇచ్చినా నిరాకరిస్తున్న మిలిటెంట్లు'
కట్టుబట్టలతో ఉత్తరగాజాను వీడుతున్న పౌరులు- గుర్రాలు, గాడిద బళ్లపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణం