Boat Accident Wedding Procession: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో భాగంగా సుమారు వంద మందితో నదిలో విహరిస్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
![18 women killed in Pakistan wedding boat capsize](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pak-boat-tragedy_1807newsroom_1658160126_665.jpg)
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్‌లోని మచ్కా ప్రాంతంలో ఓ వివాహం ఘనంగా జరిగింది. అనంతరం సుమారు వంద మంది ఖరోర్ గ్రామానికి ఊరేగింపుగా పయనమయ్యారు. సింధు నదిలో ఆడుతూ పాడుతూ పడవలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే, కాసేపటికే వారి పడవలోకి నీరు రావడం వల్ల ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. అందులో చాలా మంది పురుషులకు ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది మహిళలు మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. సుమారు 30 మందిని స్థానికులు రక్షించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను మొదలుపెట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లోని చాలా గ్రామాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా వెళ్తే అధిక ఖర్చులు అవుతాయని భావించి పడవల్లో ప్రయాణిస్తూ ఊరేగింపులు చేస్తారు.
ఇవీ చదవండి: 'నా మామ, భార్య జోలికొస్తే..'.. వారికి రిషి స్ట్రాంగ్ కౌంటర్!