కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే.. వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో కానుందున కొన్ని దేశాలు 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్' పద్ధతిని అనుసరిస్తున్నాయి. రెస్టారెంట్లు, బార్లు, క్రీడా వేదికలు, పబ్‌లలో పౌరులను అనుమతించేందుకు ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ సర్టిఫికేట్లను అనివార్యం చేస్తున్నాయి.
వ్యాక్సిన్ తీసుకుంటేనే..
వ్యాక్సిన్ తీసుకున్నవారికి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ 'గ్రీన్ పాస్' అనే పద్ధతిని అనుసరిస్తోంది. టీకా తీసుకున్నవారు ఈ పాస్‌ను చూపి థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇదే తరహాలో వ్యాక్సిన్ పాస్‌పోర్టులు అమల్లోకి తీసుకురావాలని బ్రిటన్ సన్నాహాలు చేస్తోంది.
విమర్శలెందుకు?
'వ్యాక్సిన్ పాస్‌పార్ట్' విధానంపై విమర్శలూ తీవ్రంగానే ఉన్నాయి. ఈ పద్ధతి అనుసరిస్తే వ్యాక్సిన్ తీసుకోనివారిపై వివక్ష చూపే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. తప్పనిసరి వ్యాక్సినేషన్ కొందరికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది సమాజ హితం కోసమే అని మరికొందరు అంటున్నారు. టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేనందున పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ సరైందని భావిస్తున్నారు. మళ్లీ.. కొవిడ్‌కు ముందున్న సాధారణ పరిస్థితులు తిరిగి రావాలంటే వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్‌ల అవసరం ఎంతో ఉందని చెబుతున్నారు.
టీకా తీసుకోకపోతే..
ఆరోగ్య సమస్యల కారణంగా టీకా తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తుంటారు. ఇలాంటి వారికోసం ఓ ప్రత్యేక పాస్‌ను కూడా ఏర్పాటు చేయాలని కొన్ని దేశాలు యోచిస్తున్నాయి. ఈ పాస్ ఉంటే.. వారికి ఏ కార్యక్రమాలకైనా వెళ్లే ఆస్కారం ఉంటుంది.
జీవనవిధానం సాధారణం అయ్యేందుకు వ్యాక్సినేషన్ పాస్పోర్ట్స్ పద్ధతి ఉపయోగపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు మునుపటిలా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?