Wedding Ring Lost: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల క్రితం ఓ మహిళ తాను పోగొట్టుకున్న ఉంగరం.. మళ్లీ ఆమె చెంత చేరింది. ఆ ఉంగరం పడిపోయిన ప్రాంతంలో ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ సాయంతో మూడు రోజులపాటు వెతికి, చివరకు దాన్ని కనిపెట్టడం విశేషం. బ్రిటన్ సమీపంలోని ఔటర్ హెబ్రైడ్స్ దీవి వెస్ట్రన్ ఐల్స్‌లో ఇది వెలుగుచూసింది.
ప్రస్తుతం 86 ఏళ్ల వయసున్న పెగ్గీ మాక్‌స్వీన్ దాదాపు 50 ఏళ్ల క్రితం స్థానిక బెన్‌బెకులాలోని తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలు సేకరిస్తుండగా.. ఆమె వేలినుంచి పెళ్లినాటి ఉంగరం జారిపోయింది. వెతికినా.. ఫలితం లేకపోకపోయింది. ఇక ఎప్పటికీ దొరకదని వదిలేసింది. ఇన్నేళ్లకు ఈ విషయం తెలుసుకున్న స్థానికుడు, స్వతహాగా మెటల్ డిటెక్టరిస్ట్ అయిన డొనాల్డ్ మాక్‌ఫీ.. ఆ ఉంగరాన్ని వెతికిపట్టేందుకు రంగంలోకి దిగాడు.
మెటల్ డిటెక్టర్ సాయంతో ఒకప్పుడు ఆమె రింగ్ పోగొట్టుకున్న ప్రాంతం.. ఇప్పుడు తీరప్రాంత గడ్డి మైదానంగా మారిన లినిక్లేట్ మాంఛైర్‌లో వెతుకులాట ప్రారంభించాడు. ఎట్టకేలకు మూడు రోజుకు అనుకున్నది సాధించాడు.
'లక్షలో ఒక కేసులోనే సాధ్యం..'
'మూడు రోజులపాటు దాదాపు 5 వేల చదరపు మీటర్ల పరిధిలో వెతికాను. సుమారు 90 గుంటలు తవ్వాను. బంగారు ఉంగరాలు, అదే ఆకారంలోని రింగ్ పుల్స్‌ను గుర్తించినప్పుడు మెటల్ డిటెక్టర్ ఒకే విధమైన ధ్వని చేస్తుంది. దీంతో కాస్త ఇబ్బంది ఎదురైంది. అటువంటివి చాలానే వచ్చాయి. గుర్రపు నాడలు, డబ్బాలు తదితర వస్తువులూ బయటపడ్డాయి. కానీ, మూడో రోజు నాకు ఉంగరం దొరికింది.
నేను పూర్తిగా ఆశ్చర్యపోయా. లక్షలో ఒక కేసులో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. కచ్చితంగా నా ఉత్తమ అన్వేషణల్లో ఇది ఒకటి. అదృష్టం కూడా కలిసొచ్చింది' అని మాక్‌ఫీ వివరించారు.
ఇదీ చూడండి: Plane Tyre Burst: విమానం టైర్ పంక్చర్- ప్రయాణికులు దిగి ఏం చేశారంటే..