వ్యాక్సిన్ ఎగుమతులను భారత్ నిలిపివేయగా వివిధ దేశాలు.. టీకా రెండో డోసు దొరక్క ఇబ్బంది పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా భారత ప్రభుత్వంతో అత్యవసరంగా సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"టీకా రెండో డోసు వేయకుండా మిగిలిపోయిన దేశాలెన్నో ఉన్నాయి. 30నుంచి 40కు పైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, వారు ఆ టీకాలను మాకు అందించటం లేదు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా భారత ప్రభుత్వంతో ఈ టీకాలను అత్యంత వేగంగా మళ్లీ సరఫరా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాం."
-బ్రూస్ ఐల్వార్డ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ సలహాదారు.
భారత్ పొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంక సహా మరెన్నో దేశాలు.. కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని ఐల్వార్డ్ తెలిపారు. తాము ఈ దేశాలకు వ్యాక్సిన్ డోసులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
జూన్ నెల ప్రారంభంలో తాము 8 కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేశామని ఐల్వార్డ్ తెలిపారు. అన్ని దేశాలకు టీకా పంపిణీని సమానంగా చేపట్టేందుకు తమకు మరో 20 కోట్ల టీకా డోసులు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తమకు టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.
ఇదీ చూడండి: Bharat Biotech: 'కొవాగ్జిన్'పై 23న డబ్ల్యూహెచ్‌ఓ భేటీ
ఇదీ చూడండి: 'డెల్టా' వేరియంట్‌తో మానవాళికి పెను ముప్పు తప్పదా?