పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్.. మాస్కోలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. దాదాపు వీరి సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. అయితే ఈ భేటీకి సంబంధించి ఇజ్రాయెల్ ముందస్తుగానే అమెరికాకు సమాచారం ఇచ్చింది. ఈ చర్చలకు బైడెన్ మద్దతిచ్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. పుతిన్‌తో సమావేశం సందర్భంగా బెన్నెట్‌తో ఇజ్రాయెల్ మంత్రి జీవ్ఎల్కిన్ ఉన్నారు. ఈయన ఉక్రెయిన్‌లో మూలాలు కలిగిన వ్యక్తి.
అమెరికా సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను ఖండించింది. ఆ దేశానికి సంఘీభావం ప్రకటించింది. మానవతా దృక్పథంతో సాయాన్ని పంపింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు మాస్కోతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు ఈ నెల 7న (సోమవారం) మూడో విడత శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.