కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావాలని భారత సంతతితోపాటు ఇతర మైనారిటీలను బ్రిటన్ ప్రభుత్వం కోరింది. పరీక్షలను వేగవంతం చేసేందుకు సహకరించాలని అభ్యర్థించింది. ఇందుకోసం గుజరాతి, పంజాబి, బెంగాలీ, ఉర్దూ వంటి భాషల్లో ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.
బ్రిటన్ భద్రతా మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. బ్రిటన్ వ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఇప్పటికే లక్షమందికిపైగా వలంటీర్లు నమోదు చేసుకున్నారు. అయితే అందరిపై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు అన్నివర్గాల ప్రజలు ఇందులో పాల్గొనాలని బ్రిటన్ ప్రభుత్వం కోరుతోంది.
పేరు నమోదు చేసుకోవాలి..
ట్రయల్స్ కోసం ఇంకా వందల మంది వలంటీర్లు కావాలని బ్రిటన్ వాణిజ్య మంత్రి ఆలోక్ వర్మ తెలిపారు. వీరంతా 'నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కొవిడ్- 19 రీసెర్చ్ రిజిస్ట్రీ'లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే కొన్ని నెలల్లో ఎన్హెచ్ఎస్, పరిశోధన సంస్థలు కలిసి ట్రయల్స్ ప్రారంభించనున్నాయని స్పష్టం చేశారు.
ఆస్ట్రా జెనికా సహకారంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్.. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్‌లో సమర్థంగా పనిచేసినట్లు గుర్తించారు. 6 రకాల జనసమూహాలకు, నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ క్రమాలను రూపొందించారు.
ఇదీ చూడండి: 'ఆక్స్‌ఫర్డ్' కరోనా వ్యాక్సిన్.. నేటి నుంచే ప్రయోగం