విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసా నిబంధనల్లో బ్రిటన్ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న టైర్ 4 వీసా వ్యవస్థ స్థానంలో కొత్తగా పాయింట్ల ఆధారిత విధానాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 5 నుంచి కొత్త విధానం ప్రారంభమవనున్నట్లు బ్రిటన్ హై కమిషన్ (బీహెచ్‌సీ) ప్రకటించింది.
బీహెచ్‌సీ ప్రకారం.. విదేశీ విద్యార్థులు బ్రిటన్ వీసా పొందాలంటే 70 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.
కొత్త పద్ధతిలో వీసా పొందాలంటే..
ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఆఫర్ లేటర్, ఇంగ్లీష్‌లో మాట్లాడటం, బ్రిటన్‌లో చదువుకునే రోజుల్లో వారిని వారు పోషించుకునే సామర్థ్యం ఉంటే.. వీసాకు కావాల్సిన పాయింట్లను సాధించొచ్చు అని బీహెచ్‌సీ తెలిపింది. విద్యార్థులు కోర్సు ప్రారంభమయ్యే 6 నెలల ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఇంతకు ముందు టైర్ 4 విధానంలో ఇది మూడు నెలలుగా ఉండటం గమనార్హం.
తమ దేశంలో ఎక్కువగా చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో.. భారతీయులు కూడా ఒకరని బ్రిటన్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది భారతీయ విద్యార్థులకు.. స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో చాలా మంది విదేశీ విద్యార్థులు తమ కోర్సుల్లో జాయిన్ అయ్యే ప్రణాళికను.. 2021కి వాయిదా వేసుకుంటున్నట్లు తెలిసిందని బ్రిటన్ పేర్కొంది.