అపరిచితుడు సినిమాలో విక్రమ్ అద్భుత పాత్రాభినయాన్ని తలపిస్తూ.. నిజ జీవితంలోనూ అచ్చం ఇలాగే ప్రవర్తిస్తోంది ఓ యువతి. అందులో రామానుజమ్ తనలో రెండు పాత్రలను ఇనుమడిస్తే.. ఈమెలో మాత్రం ఏకంగా పాతిక మంది వచ్చిపోతున్నట్టు చెబుతోందామె. బ్రిటన్లోని డెవన్‌లో నివసిస్తున్న 23ఏళ్ల బూ హూపర్.. 25 మందిలా ప్రవర్తిస్తుంటుంది. ఒకసారి ట్రాసీ పేరుతో టీనేజి అమ్మాయిలా.. మరోసారి లేలా పేరుతో ఐదేళ్ల చిన్నారిలా.. ఇంకోసారి టెక్సాస్ పేరుతో మధ్య వయస్కురాలిగా... ఇలా 25 రకాలుగా ప్రవర్తిస్తోందట. వారిలో 13 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడట. ఎప్పుడు, ఎవరిలా ప్రవర్తిస్తానో తనకే తెలియదని హూపర్ అంటోంది. ఆ 25 మందికి వేషధారణ, ఆహార అలవాట్లు, మాట్లాడే తీరు వేర్వేరుగా ఉన్నాయని వెల్లడించింది. తాను టీనేజ్లో ఉన్నప్పుడే తనలో వేర్వేరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిందట. వారి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చిందామె.
అయితే.. వైద్యులు ఆమెకు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నట్లు తేల్చారు. ట్రామాకు గురవ్వడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. హూపర్‌కు ఇలాంటి వ్యాధి ఉండటం వల్ల.. తను ఎక్కడికికీ వెళ్లలేకపోతోందని చెబుతోంది. ఉద్యోగానికి కూడా వెళ్లడానికి వీల్లేకుండా పోతోందని వాపోతోంది.
హూపర్ తనలోని వ్యక్తుల అభిరుచులకు తగ్గట్టుగా ముస్తాబవుతూ ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వ్యాధి నయమవడం కోసం వైద్యులు, కుటుంబసభ్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆహా! పాదముద్రలతో మంచుపై అందమైన కళాకృతులు