స్వతంత్రంగా జీవించాలన్న బ్రిటన్ ఆకాంక్ష ఈ రోజు నెరవేరనుంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్లిటన్ వైదొలిగే ప్రక్రియకు ఈయూ పార్లమెంటు ఆమోదం లభించింది. ఫలితంగా 2016లో బ్రిటన్ రిఫరెండంతో మొదలైన బ్రెగ్జిట్.. ఇప్పటికి పూర్తయింది. ఇక నుంచి బ్రిటన్ వాణిజ్యం, సరిహద్దు అంశాల్లో స్వతంత్ర దేశంగా ఉంటుంది.
వాణిజ్య అవసరాల కోసం ఏర్పడిన ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ 1973లో చేరింది. కూటమి నుంచి వైదొలుగుతున్న మొదటి దేశం యూకే కావటం విశేషం.
అసలేంటి ఈ దేశాల కూటమి?
ఐరోపాలోని 28 దేశాలతో ఏర్పడిన వాణిజ్య, రాజకీయ కూటమి ఈయూ. మొదట దీనిని ఐరోపా ఆర్థిక సమాజంగా పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్య వాణిజ్య పరమైన సహకారం కోసం ఈయూ ఆవిర్భవించింది. వ్యాపారం కోసం ఐరోపా దేశాలు పరస్పర యుద్ధానికి దిగరాదన్నదే దీని ఏర్పాటు వెనక ఉద్దేశం.
సమాఖ్య ఒప్పందం ప్రకారం అన్ని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం అమల్లో ఉంటుంది. వస్తు రవాణాపై ఎలాంటి కస్టమ్ సుంకాలు ఉండవు.
ఇందులో మరో ప్రధానమై ఒప్పందం.. స్వేచ్ఛా గమనం. అంటే ఒక ఈయూ దేశానికి చెందిన వ్యక్తి ఎలాంటి వీసా లేకుండా వేరే ఈయూ దేశంలో జీవించవచ్చు.
బ్రెగ్జిట్ అంటే..
బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఇందుకోసం 2016 జూన్ 23న బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం (1.74 కోట్ల మంది) ప్రజలు తీర్పునిచ్చారు.
ఎందుకు?
ఐరోపా సమాఖ్యలో ఉన్న కారణంగా తాము వెనకబడిపోతున్నట్లు బ్రిటన్ భావించింది. వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తున్నారని ఆరోపించింది. సభ్యత్వ రుసుం కింద ఏటా వందల కోట్లు వసూలు చేస్తున్నారని, కానీ దానికి సరైన ప్రతిఫలం దక్కట్లేదన్నది ఆ దేశం వాదన.
బ్రిటన్ తన సరిహద్దుల విషయంలో పూర్తి నియంత్రణ పొందాలని భావిస్తోంది. ఈయూ దేశాల వలసలను నియంత్రించాలని చూస్తోంది.
బ్రెగ్జిట్ తర్వాత ఏమవుతుంది?
నేటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినా.. రెండు పక్షాల మధ్య ఎన్నో అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. సమాఖ్య దేశాలతో భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండాలన్న విషయమై సమాలోచనలు చేయాల్సి ఉంది. కూటమి సహా ఇతర దేశాలతో బ్రిటన్ సరికొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
ఇందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ 11 నెలల సమయంలో ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారమే బ్రిటన్ నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు స్వేచ్ఛా వాణిజ్యం, గమనంలో ఎలాంటి మార్పులు ఉండవు.
వాణిజ్య యుద్ధం, కరోనా సంక్షోభాల నేపథ్యంలో 11 నెలల గడువుపై బ్రిటన్ను ఐరోపా సమాఖ్య హెచ్చరించింది. ఇంత తక్కువ కాలం సరిపోదని చెప్పింది. అయితే బ్రిటన్ ప్రధాని మాత్రం గడువును పెంచేందుకు ఒప్పుకోలేదు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం?
27 సభ్య దేశాల కూటమి అయిన ఈయూ నుంచి విడిపోయిన బ్రిటన్ ఇప్పుడు.. తనకు నచ్చిన విధంగా వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అందువల్ల భారత్‌తో కూడా ప్రత్యేకంగా ఓ వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
"ఫిబ్రవరి 1న ఈయూ వెలుపల ఉన్న 13 దేశాల్లోని 18 నగరాలతో నూతన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మా ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. భవిష్యత్ ప్రపంచ భాగస్వాములతో మా సంబంధాలను మరింత పెంచుకుంటాం."- డౌనింగ్ స్ట్రీట్ ప్రకటన
ఇదీ చూడండి: 'మస్కా' మజాకా... గంటలో రూ.16వేల కోట్ల సంపద