పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అసోం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కర్ఫ్యూనూ లెక్కచేయకుండా కొన్ని చోట్ల నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన పౌరసత్వ సెగ విదేశీ పర్యటకులను తాకింది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతోన్న నేపథ్యంలో భారత్‌కు వెళ్లే తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి అమెరికా, బ్రిటన్ దేశాలు.
"పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. గువాహటిలో కర్ఫ్యూ విధించారు. అసోంలోని కొన్ని జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. అందువల్ల ఈశాన్య భారతానికి వెళ్లే బ్రిటన్ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్థానిక మీడియా నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు పాటించాలి'' అని యూకే తమ ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది.
అటు అమెరికా దాదాపు ఇలాంటి సూచనలే చేసింది. అంతేగాక.. తమ అధికారుల అసోం పర్యటనలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన కూడా రద్దయింది.