బ్రిటన్ ప్రధాని థెరిసా మే కి బ్రెగ్జిట్ గండం పట్టుకుంది. సొంత మంత్రివర్గం నుంచే ఆమె రాజీనామా కోసం ఒత్తిడి పెరిగిపోతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియను థెరిసా మే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా వైదొలిగితే అది బ్రిటన్‌కే నష్టమని ప్రధాని థెరిసా మే చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రవేశపెట్టిన 'నో డీల్ బ్రెగ్జిట్'ను చట్టసభ్యులు రెండు సార్లు తిరస్కరించారు. వచ్చేవారం బ్రెగ్జిట్‌పై మూడోసారి పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఇందులో థెరిసా ప్రతిపాదన నెగ్గకపోతే, అది ఆమె రాజీనామాకు దారితీసే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు.
థెరిసా మే కి వ్యతిరేకంగా ఉన్న చట్టసభ్యులు, మంత్రులు డేవిడ్ లిడింగ్టన్ను, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాను మాత్రం ప్రధాని 'థెరిసా మే' కే మద్దతుగా ఉంటానని లిడింగ్టన్ పేర్కొనడం విశేషం.
మరోవైపు యూకే ఛాన్సిలర్ ఫిలిప్ హమ్మండ్, ప్రధాని 'థెరిసా మే' కి అండగా నిలిచారు. ప్రధానమంత్రులను మార్చడం, మరో పార్టీకి ప్రభుత్వాధికారం రావడం వలన ఉపయోగం లేదని, చట్టసభ్యులను ఉద్దేశించి ఫిలిప్ అన్నారు. చట్టసభ్యులు థెరిసా మేకి మద్దతుగా నిలవాలని సూచించారు.
మరోసారి రెఫరెండమ్ కోసం...
శనివారం దాదాపు ఒక మిలియన్ ప్రజలు లండన్ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. బ్రెగ్జిట్‌పై రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
బ్రిగ్జిట్ గడువును ఈయూ మార్చి 29 నుంచి ఏప్రిల్ 12 వరకు పొడిగించింది. థెరిసా మే 'నో డీల్ బ్రెగ్జిట్'కు చట్టసభ ఆమోదం లభిస్తే ఈ గడువు మే 22 వరకు పొడిగించడానికి ఈయూ అంగీరించింది.
వచ్చేవారం హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ) స్పీకర్ జాన్ బార్కో అనుమతితో ఈ అంశం చర్చకు రానుంది. ఒకవేళ మరలా థెరిసా మే ప్రతిపాదన వీగిపోతే, ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్ ఈయూ నుంచి ఏప్రిల్ 12న వైదొలుగుతుంది. అదే జరిగితే థెరిసా మే రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి పెరుగుతుంది.
ఇదీ చూడండి :భారత్-పాక్ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం