ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచు గురించి ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ). మానవుల కారణంగా పెరుగుతున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్)తో మంచుకొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని తన అధ్యయనంలో పేర్కొంది.
భూమిపై 1960తో పోలిస్తే మంచు పలకలు ఐదు రెట్లు వేగంగా కరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. 1961 నుంచి దాదాపు 10.6 ట్రిలియన్ టన్నుల మంచును కోల్పోయామని నివేదికలో పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 2013తో పోలిస్తే 18 శాతం అధిక వేగంతో మంచు కరిగిపోతోందని తెలిపింది. భూమిపై ప్రతి ఏడాది 369 బిలియన్ టన్నుల మంచు మాయమవుతోందని వెల్లడించింది.
కారణాలివే...
భూమిపై మంచు వేగంగా కరగడానికి... సముద్ర మట్టాలు గణనీయంగా పెరగడం, భూతాపంతో పాటు మానవ చర్యలే ప్రధాన కారణాలని నివేదికలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మంచు ఇంత వేగంగా కరగడం మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ఈ దేశాల్లో అత్యధికం
'ఈఎస్ఏ' శాటిలైట్లతో పాటు 'ఈయు కోపర్నికస్ శాటిలైట్' ప్రపంచ వ్యాప్తంగా గల మంచుపై గత 25 సంవత్సరాలుగా పర్యవేక్షించాయి. ఈ ఉపగ్రహాలు అందించిన సమాచారం ఆధారంగా మంచు గణనీయంగా కరిగిపోతోందన్న విషయాన్ని నిర్ధరించారు శాస్త్రవేత్తలు. మధ్యఐరోపా, పశ్చిమ కెనడా, న్యూజిలాండ్, కాకసస్, అమెరికాల్లో ఈ సమస్య అత్యధికంగా ఉందని తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్పై చర్యలు
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ఈ నివేదిను చూసి... గ్లోబల్ వార్మింగ్పై తగిన జాగ్రత్తలు తీసుకుంటారని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కార్యకర్త శిరోముండనం