కరోనా వైరస్ కోసం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా తుది దశకు చేరింది. ఇప్పటివరకు చాలా మంచి ఫలితాలు రావడం వల్ల.. అక్టోబర్‌లోగా విడుదల చేసేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రెన్ హిల్ తెలిపారు. ఆయనే ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. తాము తయారు చేసిన ChAdOx1 nCoV-19 టీకా చింపాజీలపై మంచి ఫలితాలను చూపిందన్నారు. స్పానిష్ సొసైటీ ఆఫ్ రూమటాలజీలో నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారాయన. ఫలితాలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ నాటికి మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు.
ఇప్పటికే ఆస్ట్రాజెనికాతో కలిసి బ్రెజిల్‌లో వాలంటీర్లపై కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీకా రేసులో తొలిసారి తుది దశకు చేరింది కూడా ఆక్స్‌ఫర్డే కావడం విశేషం. తుదిదశలో వాలంటీర్లను సార్స్‌కోవ్-2 నుంచి టీకా ఏ మేరకు రక్షణ ఇస్తోందో పరిశీలించనున్నారు. దక్షిణాఫ్రికాలో దాదాపు 2,000 మంది ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఇక బ్రిటన్‌లో 4,000 మంది నమోదు చేయించుకున్నారు. బ్రిటన్‌లోని బిజినెస్ సెక్రటరీ అలోక్ వర్మ తొలిసారి కొవిడ్-19 టీకా తీసుకొన్న వ్యక్తిగా నిలిచారు. మరోపక్క ఆస్ట్రాజెనికా 30 మిలియన్ల డోసులను వెంటనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చదవండి: 'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు'