హింస, వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన విపత్తులతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వదేశాల్లోనే 4 కోట్ల సార్లకు పైగా నివాసాలను మార్చుకోవాల్సి వచ్చిందని ఓ నివేదిక వెల్లడించింది. అది ఈ దశాబ్దంలోనే అత్యధికమని తెలిపింది. నార్వే శరణార్థుల మండలి(ఎన్ఆర్సీ)లో భాగమైన, జెనీవాలోని అంతర్గత స్థానభ్రంశ పర్యవేక్షణ కేంద్రం ఈ మేరకు తన వార్షిక అంతర్జాతీయ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని కీలకాంశాలు..
"తుపానులు, వరదల కారణంగా గతేడాది 5.5 కోట్ల మంది స్వదేశాల్లోనే నిర్వాసితులుగా మారారు. దీర్ఘకాలిక, కొత్తగా ఏర్పడిన ఘర్షణలు కూడా అందుకు దోహదపడ్డాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు రెండు, మూడు సార్ల ఎక్కువగా నివాసాలను మార్చుకోవాల్సి వచ్చింది.
స్వదేశాల్లో నిర్వాసితులుగా మారిన వారి సంఖ్య గతేడాది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లినవారి కన్నా రెండు రెట్లు ఎక్కువ. ఈ గణాంకాలు ఇంకా చాలా తక్కువని, కొవిడ్ 19 ప్రయాణ ఆంక్షలు సమాచార సేకరణకు అడ్డంకిగా మారాయి" అని నివేదిక పేర్కొంది.
"గతేడాది ప్రతి సెకనుకు ఎవరో ఒకరు తమ ఇంటిని విడిచిపెట్టాల్సి పోవడం చాలా బాధాకరం. ఘర్షణలు, విపత్తుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటంలో మనం విఫలమవుతున్నాం."
- జాన్ ఎజిలాండ్, ఎన్ఆర్సీ ప్రధాన కార్యదర్శి
గతేడాది నిర్వాసితులుగా మారిన వారిలో 4.8 కోట్ల మంది హింస కారణంగా పారిపోయారని, మరో 70 లక్షల మంది విపత్తుల నుంచి తప్పించుకునేందుకు వలస వెళ్లారని నివేదిక వెల్లడించింది.
తీవ్రమవుతోన్న హింస..
గతేడాది ఇథియోపియా, మొజాంబిక్, బుర్కినాఫాసో లాంటి దేశాల్లో ఉగ్రవాదుల హింస విస్తృతం కావడం, కాంగో, సిరియా, అఫ్గానిస్థాన్ వంటి దేశాల్లో కొనసాగుతోన్న యుద్ధాలు ఈ పరిణామానికి ప్రధాన కారణమని నివేదిక వివరించింది. ఇక అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాల్లో తీవ్రమైన తుపాను సీజన్, పశ్చిమాసియా, సబర్బన్ ఆఫ్రికాల్లో సుదీర్ఘ వర్షాకాలం మూలంగా నిర్వాసితుల సంఖ్య పెరిగిందని తెలిపింది.
చైనాలోనే ఎక్కువ..
మొత్తంగా, స్వదేశంలో నిర్వాసితులుగా మారినవారు చైనాలోనే ఎక్కువని నివేదిక వెల్లడించింది. తరచుగా సంభవించే వరదల కారణంగా గతేడాది చైనా 50 లక్షల మందికి పైగా మకాం మారాల్సి వచ్చింది. చైనా తర్వాత ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్లో ఎక్కువ మంది నిర్వాసితులుగా మారారు.
ఇదీ చూడండి: 'భారత్కు 4వేల మందికిపైగా మయన్మార్ శరణార్థులు'