ప్రపంచంలోని అతి పేద దేశాలతో పాటు.. 60 పేద దేశాల్లో కరోనా వైరస్ టీకా పంపిణీ మొదటి డోసుతోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది. టీకా కొరత కారణంగా వీటికి సహాయం అందించేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ కార్యక్రమం కొవాక్స్ దాదాపు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. జూన్ చివరి నాటి వరకు టీకాలు అందని పరిస్థితి ఏర్పడటం ఇందుకు కారణం.
అల్పాదాయ దేశాలకు 'కొవాక్స్' కార్యక్రమం కింద గత వారంలో 25,000 కంటే ఎక్కువ మోతాదులు మాత్రమే సరఫరా కాగా.. సొమవారం నాటికి ఇవి పూర్తిగా నిలిచిపోయాయి. గత రెండు వారాల్లో 92 దేశాలకు 20 లక్షల కంటే తక్కువ డోసులు అందాయి. ఇది ఒక్క బ్రిటన్కు అందిన టీకాలతో సమానం అని యునిసెఫ్ డేటా స్పష్టం చేస్తోంది.
ధనిక దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్ లభించగా.. పేద దేశాల్లో మాత్రం 500 మందిలో ఒకరు మాత్రమే మొదటి డోసు పొందగలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న అసమానతలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు.
భారత్ నుంచి టీకాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత మరింత ఉద్ధృతం అయ్యేందుకు అవకశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవాక్స్ కార్యక్రమం కింద సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసే ఆస్ట్రాజెనెకా టీకాలు ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు ఉండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో మొదటి దశలో టీకాలు పొందిన వారందరికీ రెండో దశలో టీకా అందుతుందా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.
ఏప్రిల్ చివరి నాటికి చైనా వ్యాక్సిన్‌ల పంపిణీకి మార్గం సుగమం అవుతుందని గత నెలలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అయితే.. చైనా టీకాలైన సినోఫార్మ్, సినోవాక్లకు సంబంధించి సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం కలవరపెట్టే అంశం.
ధనిక దేశాలు అత్యవసరంగా 10 మిలియన్ మోతాదులను అందించాల్సిందిగా ఈ నెల ప్రారంభంలో డబ్ల్యూహెచ్‌ఓ చేసిన విజ్ఞప్తిపై సరైన స్పందన లేదు.
ఇవీ చదవండి: కరోనా విలయం: ఆ దేశాల్లో రికార్డు స్థాయి కేసులు