మహిళలకు అండగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్. నెలసరి సంబంధిత వస్తువులను ప్రభుత్వం తరఫున ఉచితంగా అందించనున్న తొలిదేశంగా నిలవనుంది. పీరియడ్స్ సమయంలో తగిన సౌకర్యాలు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా స్కాట్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లు.. ఆ దేశ పార్లమెంట్లో మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
కొత్త నిబంధనల ప్రకారం.. స్కాట్లాండ్లోని మహిళలు, అమ్మాయిలకు పాఠశాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలలో ఉచితంగా నెలసరి వస్తువులు అందుతాయి. శానిటరీ న్యాప్కిన్స్ను మహిళలకు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత స్థానిక అధికారులపై ఉంటుంది. గతేడాది ఈ బిల్లును మోనికా లీనన్ అనే సభ్యురాలు.. పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తాజాగా.. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
"వాణిజ్య సంఘాలు, మహిళలకు రక్షణ కల్పించే స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే ఈ చట్టం వచ్చింది. స్కాట్లాండ్ ఒక్క దేశమే "పీరియడ్ పావర్టీ"ని ఎదుర్కొన్న దేశంగా నిలిచిపోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందిరికీ నెలసరి వస్తువులు అందాలి."
-- మోనికా లీనన్, స్కాట్లాండ్ చట్టసభ సభ్యురాలు.
అత్యంత ప్రధానమైన బిల్లుకు మద్దతుగా ఓటు వేసినందుకు గర్వంగా ఉందని స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జన్ తెలిపారు. మహిళలు, అమ్మాయిల కోసం ఇది అత్యంత ప్రధానమైనదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
2017లో సీఎన్ఎన్ వార్తాసంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. బ్రిటన్లో పది మందిలో ఒకరు "పీరియడ్ పావర్టీ"ని ఎదుర్కొంటున్నారని తేలింది. అందులో సగం మంది 14-21 ఏళ్ల వయస్సు ఉన్నవారే. ఈ కారణంగా సగం మంది అమ్మాయిలు.. పాఠశాల విద్యకు దూరమవుతున్నారని వెల్లడించింది.
ఇదీ చూడండి:క్రిస్మస్ కోసం బ్రిటన్లో ఆంక్షల సడలింపు