ప్రస్తుతం అనుమానిత వ్యక్తి నుంచి రక్తాన్ని లేదా ప్లాస్మా సేకరించి యాంటీబాడీ టెస్టును నిర్వహిస్తున్నారు. వీటిని సేకరించడానికి ప్రత్యేక శిక్షణ కలిగిన మెడికల్ సిబ్బంది కావాల్సి వస్తోంది. ఒక్కోసారి కరోనా సోకిన వ్యక్తుల శరీరం నుంచి రక్తం సేకరించడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలో భారీ సంఖ్యలో యాంటీబాడీ టెస్టులు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. వీటికి ప్రత్యామ్నాయంగా నూతన విధానంతో శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు.
డీబీఎస్‌తో..
కేవలం ఎండిన రక్తపు శాంపిళ్ల(డ్రైడ్ బ్లడ్ స్పాట్-డీబీఎస్)తో కచ్చితమైన యాంటీబాడీ టెస్టులు సాధ్యమని ప్రకటించారు. ఈ పద్ధతిలో శాంపిల్‌ను సులభంగా సేకరించడమే కాకుండా తక్కువ ఖర్చుతో రోగి స్వయంగా ఇంటివద్దే శాంపిల్‌ను సేకరించవచ్చని పేర్కొన్నారు. అనంతరం వీటిని ఫోరెన్సిక్ గ్రేడ్ కార్డు ద్వారా ల్యాబ్‌కు పంపించే వీలుంటుందని లండన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
రెండు ఫలితాలు ఒకే విధంగా..
వీటి పనితీరులో భాగంగా వాలంటీర్ల నుంచి సేకరించిన రక్తంతోపాటు డీబీఎస్ శాంపిళ్లను లండన్‌లోని బర్మింగ్‌హమ్‌కు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ వాలంటీర్లలో అప్పటికే కొందరు వైరస్ బారినపడిన వారు కాగా మరికొందరికి నెగెటివ్ వచ్చిన వారున్నారు. ఇంకొందరికి మాత్రం ఎలాంటి పరీక్షలు జరపలేదు. వీరి నుంచి రెండురకాల శాంపిళ్లను సేకరించి కరోనా వైరస్ యాంటీబాడీ టెస్టు నిర్వహించారు. అనంతరం రెండు శాంపిళ్ల ఫలితాలు ఒకేవిధంగా వచ్చినట్లు గుర్తించారు. డీబీఎస్ శాంపిళ్లలో 98నుంచి 100శాతం యాంటీబాడీలను గుర్తిస్తున్నాయని తేల్చారు. అంతేకాకుండా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయిన రోగుల్లోనూ 100శాతం యాంటీబాడీలను ఈ పద్ధతిలో గుర్తించగలుగుతున్నట్లు పరిశోధకులు తేల్చారు.
'ప్రత్యేక శిక్షకులు అవసరం లేదు'
ఎండిన రక్తపు శాంపిళ్ల (డ్రైడ్ బ్లడ్ స్పాట్-డీబీఎస్) ద్వారా యాంటీబాడీ టెస్టులు చేయడం ఇప్పటికే ఉన్న పద్ధతికి ప్రత్యామ్నాయంతో పాటు శాంపిళ్లను తీసుకోవడానికి ప్రత్యేక శిక్షకులు కూడా అవసరం లేదని బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ నిపుణులు డాక్టర్ మాథ్యూ ఓషియా స్పష్టంచేశారు. వీటితోపాటు తక్కువ ఖర్చుతో చేయడం మధ్య ఆదాయ దేశాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ అడమ్ కన్నిన్‌ఘమ్ అభిప్రాయపడ్డారు.
కొనసాగుతున్న పరిశోధనలు..
కరోనా తీవ్రత అధికంగా ఉన్న లండన్‌లో భారీ సంఖ్యలో యాంటీబాడీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తాన్ని సేకరించకుండా ప్రత్యామ్నాయంగా యాంటీబాడీ టెస్టులు చేయడం కోసం పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటిలోభాగంగా ఈ టెస్టుల కోసం డీబీఎస్ పద్ధతి ఎంతో మెరుగైందని బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సమయంలోనే కాకుండా ఇతర వైరస్‌ల విషయంలోనూ యాంటీబాడీలను గుర్తించేందుకు ఈ డీబీఎస్ పద్ధతిపై పరిశోధనలు జరిగాయి.
ఇదీ చూడండి:కరోనా టీకాకు 'జి' హుజూర్ అనాల్సిందే!