కరోనా కట్టడి కోసం విధించిన సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత తొలిసారి ఇంగ్లాండ్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధన సాగించేందుకు దేశంలోని విద్యా సంస్థలు సిద్ధమయ్యాయి.
విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరినొకరు నేరుగా తాకే అవసరం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ పాఠశాలల తిరిగి ప్రారంభమవుతాయని ఇంగ్లాండ్ విద్యా శాఖ తెలిపింది. పాఠశాల, కళాశాలల కారిడార్లు, ఆవరణ సహా కొవిడ్ ముప్పు అధికంగా ఉండే ప్రాంతాల్లో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరని పేర్కొంది.
"ఈ కొత్త విద్యా సంవత్సరంలో చాలా మందికి ఇది మొదటి రోజు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నందున వేలాది మంది విద్యార్థులు మళ్లీ తమ పాఠశాలలకు రాబోతున్నారు. విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి పాఠశాలలు తిరిగి ప్రారంభించడం అవసరం. టీచర్లు, పాఠశాలల సిబ్బంది కృషివల్ల ఇది సాధ్యమైంది."
-గవిన్ విలియమ్స, యూకే విద్యాశాఖ సెక్రెటరీ
పునఃప్రారంభానికి ముందు దేశంలోని పాఠశాలలను మంత్రులు సందర్శించినట్లు విద్యా శాఖ వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి జరగకుండా తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సిఫార్సుల మేరకు పాఠశాలలు కఠిన నిబంధనలు పాటించనున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. అవసరమైన సమయంలో ఉపయోగపడే విధంగా పాఠశాలలకు పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. మెరుగైన రవాణా సౌకర్యాల కోసం స్థానిక సంస్థలకు 40 మిలియన్ పౌండ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: పులికి చెమటలు పట్టించిన ఏనుగు!