Russia Ukraine war: ఉక్రెయిన్‌పై సైనికచర్య 17రోజులుగా కొనసాగుతూనే ఉంది. మరింత ఉద్ధృతంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. నిప్రో, లస్క్ వైమానిక కేంద్రం, ఇవానో ఫ్రాన్కివిస్క్ నగరాల్లో మాస్కో సేనలు బాంబుల వర్షం కురిపించాయి. మరియుపోల్‌లో 80మందికిపైగా తలదాచుకున్న ఓ మసీదుపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎంతమంది చనిపోయారనే విషయం తెలియాల్సి ఉందని పేర్కొంది. 34మంది చిన్నారులు సహా 86మంది టర్కీ దేశస్థులు ఈ మసీదులో తలదాచుకున్నట్లు టర్కీలోని ఉక్రెయిన్ ఎంబసీ తెలిపింది.
Russia Ukraine war deaths
సైనిక చర్య మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 579 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల హైకమిషన్ తెలిపింది. వెయ్యిమందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. మృతుల్లో 42 మంది, క్షతగాత్రుల్లో 54 మంది చిన్నారులు ఉన్నారని వివరించింది. షెల్లింగులు, భారీ ఆర్టిలరీ, క్షిపణులతో చేసిన దాడుల్లోనే ఎక్కువమంది మరణించారని అంచనా వేసింది. మరోవైపు, 25 లక్షల మంది పౌరులు ఇతరప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఐరాస పేర్కొంది. అందులో సగానికి పైగా పోలాండ్‌లోనే తలదాచుకుంటున్నట్లు వెల్లడించింది.
ఈశాన్య నగరాలైన కీవ్, లివివ్, ఖార్కివ్, చెర్కసీ, సుమీ ప్రాంతాల్లో షెల్టర్లలోకి వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఇప్పటికే పలునగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న మాస్కో సేనలు... తాజాగా మరియుపోల్ నగరం తూర్పు శివారు ప్రాంతాలను.. రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. కీవ్ సహా సెవెరోడోనెట్స్క్పై పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది.
మేయర్ కిడ్నాప్...
రష్యా బలగాలు కీవ్‌కు సమీపంలో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు తెలిపారు. మెలిటొపోల్ మేయర్‌ను క్రెమ్లిన్ సేనలు అపహరించినట్లు ఆరోపించారు. ఆయనను రష్యా బలగాలు తీసుకెళ్తున్న వీడియోను... ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం అధికారి ఒకరు సామాజికమాధ్యమాల్లో పోస్టు చేశారు. తమ మేయర్‌ను అపహరించి మాస్కో యుద్ధ నేరానికి పాల్పడిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
ఎంఎఫ్ఎన్ రద్దు...
US Russia MFN status: రష్యాపై ఇప్పటికే అనేకరకాల ఆంక్షలు విధించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తాజాగా అత్యంత ప్రాధాన్య దేశం(ఎంఎఫ్ఎన్) హోదాను తొలగించాలని నిర్ణయించింది. మాస్కో నుంచి పలురకాల వస్తువుల దిగుమతులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. యుద్ధానికి కారణమైన పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రష్యా సహా ఆ దేశానికి సహకరిస్తున్న బెలారస్‌కు లగ్జరీ వస్తువుల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. ఐరోపా సమాఖ్య కూడా రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతులపై నిషేధం విధించింది.
రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రష్యా నిషేధం విధించడాన్ని... ఆ సంస్థ చీఫ్ తప్పుపట్టారు. రష్యా చర్య సరైంది కాదని ట్విట్ చేశారు.
ఇదీ చదవండి: 'రష్యాపై ఆంక్షలు ఎత్తివేయకపోతే.. ఐఎస్ఎస్ కూలిపోవచ్చు!'