Russia Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానమైన అంతర్జాతీయ కోర్టులో జరిగిన విచారణకు రష్యా గైర్హాజరైంది. నెదర్లాండ్స్, ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో రష్యా న్యాయవాదుల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా కనిపించాయి. సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైనప్పటికీ.. రష్యా తరఫున ఎవరూ రాలేదు. మౌఖిక విచారణలో పాల్గొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని నెదర్లాండ్స్‌లోని రష్యా రాయబారి సమాచారం అందించారని కోర్టుకు అధ్యక్షత వహిస్తున్న అమెరికా న్యాయమూర్తి జోన్ ఈ డొనోగూ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా బృందాలు లేకుండానే విచారణ కొనసాగింది.
Russia Ukraine ICJ hearing
రష్యా ఆక్రమణను అడ్డుకోవాలంటూ ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది అంతర్జాతీయ న్యాయస్థానం. సోమవారం ఉక్రెయిన్ ప్రతినిధులు తమ వాదన వినిపించనుండగా.. రష్యా న్యాయవాదులకు మంగళవారం అవకాశం లభించనుంది.
కొద్దిరోజుల పరిశీలన తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రష్యా వీటిని పాటించే అవకాశాలు తక్కువ. అయితే, కోర్టు ఫలితంతో సంబంధం లేకుండా రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఉక్రెయిన్ ఈ కేసు వేసిందని పరిశీలకులు చెబుతున్నారు.
రాజకీయ కూటమి!
UK PM Russia political coalition: మరోవైపు, రష్యాకు వ్యతిరేకంగా రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేతో కలిసి రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను సందర్శించిన ఆయన.. ఈ కార్యక్రమంతో రష్యా అకృత్యాలకు వ్యతిరేకంగా రాజకీయ మద్దతును కూడగట్టే ప్రణాళికలను ప్రారంభించారు. ఇదే విషయంపై వారం రోజుల పాటు ప్రపంచ నేతలతో బోరిస్ చర్చించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.
రష్యా 'అక్రమ, క్రూరమైన దాడి'ని ప్రపంచం నిర్ద్వంద్వంగా ఖండించిందని బోరిస్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సానుభూతి ప్రకటించారు. యూకే పంపిన సాయం ఇప్పటికే అవసరమైన వారికి అందిందని చెప్పారు. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదనపు సాయం చేసినట్లు స్పష్టం చేశారు.
ఆర్థిక సాయం..
అంతకుముందు, ఉక్రెయిన్‌కు 100 మిలియన్ డాలర్ల అదనపు సాయం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రజలకు పెన్షన్లు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపింది. దీంతో పాటు 22 వేల మంది సైనికులకు యూకే శిక్షణ ఇస్తోంది. రెండు వేల యాంటీ ట్యాంక్ క్షిపణులను సరఫరా చేస్తోంది. ఆర్థిక సంస్కరణల కోసం 100 మిలియన్ పౌండ్లు, మానవతా సాయం కింద 120 మిలియన్ పౌండ్లు ప్రకటించింది.
మరోవైపు, యూకే కుటుంబాలతో సంబంధాలు ఉన్న 50 మంది ఉక్రెయిన్ ప్రజలకు వీసాలు జారీ చేసినట్లు బ్రిటన్ హోంశాఖ వెల్లడించింది. మరో రెండు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు.. బ్రిటన్‌కు వచ్చేందుకు అర్హులని తెలిపింది.
సంప్రదింపులు కొనసాగిస్తాం: ఫ్రాన్స్
FRANCE RUSSIA UKRAINE: ప్రపంచంలోని చాలా వరకు అగ్రదేశాలు రష్యాను దూరం పెడుతున్నప్పటికీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ మాత్రం ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. పాశ్చాత్త దేశాల కోసం దౌత్య మార్గాలను తెరిచే ఉంచుతున్నారని మేక్రాన్ పార్టీ సీనియర్ సభ్యుడు బెంజమిన్ హదాద్ తెలిపారు. పుతిన్ ఘర్షణలను తగ్గించుకోవాలని భావిస్తే.. చర్చల కోసం ఈ దౌత్య మార్గాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తరఫున కూడా మేక్రాన్.. పుతిన్‌తో మాట్లాడారని వెల్లడించారు. పౌరుల తరలింపునకు వీలు కలిగేలా స్థానికంగా కాల్పుల విరమణ పాటించాలని కోరినట్లు చెప్పారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్-మేక్రాన్ నాలుగు సార్లు మాట్లాడుకున్నారు. మొత్తంగా గడిచిన నెల రోజుల వ్యవధిలో 11 సార్లు సంభాషణలు జరిపారు.
రష్యా మాకు ముఖ్యమే: చైనా
ఇక, డ్రాగన్ దేశం చైనా.. రష్యాను పూర్తిగా వెనకేసుకొచ్చింది. రష్యా ఇప్పటికీ 'తమకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి' అని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఇప్పటికీ ఖండించని చైనా.. రష్యాతో తమ సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవని పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు విధిస్తున్న ఆంక్షలను మరోసారి ఖండించింది. ఆంక్షల వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని, ఘర్షణకు పరిష్కారం కష్టమవుతుందని చెప్పుకొచ్చింది. 'అంతర్జాతీయ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారినా.. మేం మా వ్యూహాత్మక విధానాలను పాటిస్తాం. చైనా-రష్యా సమగ్ర భాగస్వామ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తాం. ఇరుదేశ ప్రజల మధ్య ఉక్కు కవచంతో కూడిన స్నేహబంధం ఉంది' అని చైనా పార్లమెంట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌యీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా తాత్కాలిక విరామం